అమెరికాలో 2026 మధ్యంతర ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన వేళ, రాబోయే నవంబర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే అమెరికాలోని ప్రతి వయోజనుడికీ 5,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹4.75 లక్షలు) ‘ట్రంప్ డివిడెండ్’ రూపంలో అందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
2026 రిపబ్లికన్ పార్టీ సదస్సులో (RNC Midterm Convention) ప్రధాన ప్రసంగం చేస్తూ ఆయన ఈ భారీ హామీని ప్రకటించారు.
తన పరిపాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్న ట్రంప్, దేశం ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తోందని వెల్లడించారు. “మనం ఆర్థికంగా అద్భుతమైన పురోగతి సాధించాం కాబట్టే, ఈ హామీని మీకు నేను మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ రిపబ్లికన్ పార్టీ గెలిస్తే దేశంలోని ప్రతి వయోజన పౌరుడికి 5,000 డాలర్ల (సుమారు ₹4.75 లక్షలు) చొప్పున ప్రోత్సాహక నగదును అందజేస్తాం” అని ఆయన ఉద్ఘాటించారు.
ట్రంప్ 2.0 ప్రభుత్వ హయాంలో ప్రకటించిన సంక్షేమ నగదు బదిలీ పథకాల సరసన ఈ సరికొత్త ప్రకటన చేరింది. గత జూలైలో ‘ట్రంప్ అకౌంట్స్’ (Trump Accounts) పథకాన్ని ప్రారంభించిన ఆయన, 2025 జనవరి 1 నుంచి 2028 డిసెంబర్ 31 మధ్య జన్మించే ప్రతి అమెరికన్ చిన్నారి ఖాతాలో ప్రభుత్వం తరఫున ప్రారంభ డిపాజిట్గా 1,000 డాలర్లు (సుమారు ₹95,000) జమ చేస్తామని, తల్లిదండ్రులు ఏడాదికి 5,000 డాలర్ల (సుమారు ₹4.75 లక్షలు) వరకు అదనంగా పొదుపు చేసుకోవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అలాగే 2025లో ‘వారియర్ డివిడెండ్’ (Warrior Dividend) పేరిట 14.5 లక్షల మంది అమెరికన్ సైనికులకు పన్ను రహిత బోనస్గా ఒకేసారి 1,776 డాలర్లు (సుమారు ₹1.68 లక్షలు) చెల్లించారు. అయితే, ప్రస్తుతం దాదాపు 27 కోట్ల (270 మిలియన్లు) మంది వయోజనులకు ఒక్కొక్కరికీ 5,000 డాలర్ల చొప్పున పంపిణీ చేయడానికి అవసరమైన భారీ నిధులను ఎలా సమీకరిస్తారు, దీని కార్యాచరణ ఏమిటనే పూర్తి వివరాలను ట్రంప్ తన ప్రసంగంలో వెల్లడించలేదు.
గతంలో ట్రంప్ చాలామంది అమెరికన్లకు 2,000 డాలర్ల (సుమారు ₹1.90 లక్షలు) పన్ను రాయితీ చెక్కులను అందించాలని ప్రతిపాదించిన సమయంలో.. “దీనికి కాంగ్రెస్ (పార్లమెంట్) చట్టబద్ధమైన ఆమోదం తప్పనిసరి” అని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్పష్టం చేయడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల పెరుగుదల, ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో.. ఓటర్ల మద్దతును తిరిగి కూడగట్టేందుకే ట్రంప్ ఈ ఆర్థిక పాచిక విసిరినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
