ఒక్క బిందెడు నీళ్ల కోసమా ఇంత పైశాచికం.! మాటా మాటా పెరిగి.. క్షణాల్లో కత్తిపోట్లు! ముగ్గురు చిన్నారులకు తండ్రి లేని విషాదం.. ఐదుగురు బిడ్డలను అనాథలుగా వదిలిన తల్లి.!

బీహార్‌లోని మోతిహారిలో నీళ్లు ఒలకబోయడంపై మొదలైన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఇద్దరి ప్రాణాలను బలిగొన్న దారుణ కత్తిపోట్ల ఘటనగా రూపుదాల్చింది.

జిహులీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎప్పటినుంచో ఒకరికొకరు తోడుగా ఉంటున్న రెండు కుటుంబాల మధ్య నీటి విషయంలో మొదట చిన్న వాగ్వాదం తలెత్తింది. ఆ తర్వాత మాటమాట పెరిగి ఘర్షణకు దారితీయడంతో, పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది.

మొదట జరిగిన గొడవను స్థానికులు కలగజేసుకుని సర్దుబాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. నీళ్లు వెళ్లేందుకు పైప్‌లైన్ వేసే విషయంపై ఇరువర్గాలతో మాట్లాడి, ఎవరి ఇళ్లకు వారిని పంపించివేశారు. దీంతో గొడవ సద్దుమణిగిందని భావించినప్పటికీ, సాయంత్రానికి మళ్లీ ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. ఆ సమయంలో జరిగిన రక్తపాతంలో జమీ అక్తర్, మదీనా ఖాతూన్, మహీ అక్తర్ తీవ్రంగా గాయపడ్డారు.

కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడిఉన్న ముగ్గురినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ జమీ అక్తర్, మదీనా ఖాతూన్ ప్రాణాలు కోల్పోయారు. జమీ అక్తర్ తన కుటుంబానికి ఏకైక ఆధారమని స్థానికులు తెలిపారు. కూలి పనులు, ప్లైవుడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన, తన ముగ్గురు పిల్లల చదువులను, కుటుంబ బాధ్యతలను చూసుకునేవారు. ఆయన ఆకస్మిక మరణంతో భార్య, ముగ్గురు పిల్లలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

మరోవైపు మదీనా ఖాతూన్‌కు ఐదుగురు సంతానం. ఆమె భర్త ప్లైవుడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, మదీనా ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేది. ఇప్పుడు కన్నతల్లిని కోల్పోయిన ఆ ఐదుగురు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు.

ఈ దారుణంపై పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర విచారణ చేపట్టారు. ఈ దాడితో సంబంధం ఉన్న ముగ్గురు అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతి చిన్న నీటి తగాదా చివరకు రెండు ప్రాణాలను బలితీసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని నింపింది.


Posted

in

by

Tags: