పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాహుల్ లామా అనే బైకర్, గ్రామీణ ప్రాంతంలోని నిర్మానుష్య రోడ్డుపై వెళ్తుండగా అనుకోకుండా బైక్‌లో పెట్రోల్ అయిపోయింది.
చాలా దూరం బైక్‌ను నెట్టుకుంటూ వచ్చి అలసిపోయిన రాహుల్, అదే దారిలో సైకిల్‌పై వస్తున్న అబుల్ బషార్ అనే 13 ఏళ్ల బాలుడిని సహాయం కోరాడు.
సమీపంలో పెట్రోల్ బంక్ ఎక్కడైనా ఉందా అని అడగ్గా, అది చాలా దూరంలో ఉందని, వెళ్లి రావడానికి 20 నుండి 25 నిమిషాలు పడుతుందని ఆ బాలుడు చెప్పాడు. రాహుల్ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ బాలుడు అతడికి సాయం చేయడానికి ముందుకొచ్చాడు. దాంతో రాహుల్ తన వద్ద ఉన్న రూ. 500 నోటు ఇచ్చి, రూ. 100కు పెట్రోల్ తీసుకురమ్మని కోరాడు.
సుమారు అరగంట తర్వాత ఆ బాలుడు బాటిల్లో పెట్రోల్ తీసుకువచ్చి, మిగిలిన రూ. 400 చిల్లరను రాహుల్‌కి సరిగ్గా తిరిగి ఇచ్చేశాడు. అతని నిజాయితీకి మెచ్చిన రాహుల్, ఆ రూ. 400 బహుమతిగా తీసుకోమని చెప్పాడు. అయితే, 6వ తరగతి చదువుతున్న ఆ బాలుడు ఆ డబ్బులు తీసుకోవడానికి సున్నితంగా నిరాకరించాడు.
ఆ డబ్బులతో చాక్లెట్లు కొనుక్కోమని చెప్పినా ఆ బాలుడు వద్దనడంతో, రాహుల్ ఒక చిన్న ఆట ప్రారంభించాడు. దాని ప్రకారం, ఒక నిమిషంలోపు తన సోషల్ మీడియా ఖాతాకు వచ్చే ప్రతి కొత్త ఫాలోవర్కి రూ. 50 చొప్పున ఇస్తానని చెప్పాడు. ఆ ఒక్క నిమిషంలో 10 మంది కొత్త ఫాలోవర్లు రావడంతో రూ. 500ను ఆ బాలుడికి ఇచ్చాడు. కానీ ఆ డబ్బును కూడా తన వద్ద ఉంచుకోకుండా, నిరుపేదలకు ఆహారం అందించడానికి ఉపయోగించమని ఆ బాలుడు చెప్పడంతో రాహుల్ ఆశ్చర్యపోయాడు.
ఇంత చిన్న వయసులోనే ఇంతటి దయాగుణం ఎలా వచ్చిందని రాహుల్ అడగ్గా, ఇతరులకు నిస్వార్థంగా సాయం చేయాలని తన తల్లిదండ్రులే నేర్పించారని ఆ బాలుడు ఎంతో వినమ్రంగా సమాధానమిచ్చాడు. ఈ హృద్యమైన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కాగా, ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వ్యూస్ సాధించి, నెటిజన్ల మనసులను గెలుచుకుంటూ తెగ వైరలవుతోంది.
