నెలకు ₹1.2 లక్షల జీతం.. కానీ చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదట.! ₹25 వేల జీతంలో ఉన్న పరిస్థితే ఇప్పుడూ ఉందంటూ వాపోయిన 28 ఏళ్ల యువకుడు.! జీతం పెరిగినా డబ్బంతా ఎక్కడికి పోతోంది? అసలు కారణం ఇదేనట..!

నెలకు ₹1.2 లక్షల జీతం తీసుకుంటున్న 28 ఏళ్ల యువకుడొకరు, నెలాఖరుకు తన చేతిలో కేవలం ₹5,000 నుంచి ₹8,000 మాత్రమే మిగులుతోందంటూ సోషల్ మీడియాలో పంచుకున్న అనుభవం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

2021లో తాను నెలకు ₹25,000 సంపాదించేవాడినని, ప్రస్తుతం ఆదాయం ₹1.2 లక్షలకు పెరిగినప్పటికీ గతంలో ఉన్న ఆర్థిక ఒత్తిడి ఇప్పటికీ తగ్గలేదని ఆ యువకుడు పేర్కొన్నాడు.

ఆయన పోస్ట్ వివరాల ప్రకారం.. ప్రస్తుత ఆదాయంలో సింహభాగం ఇంటి అద్దె, కుటుంబానికి పంపే సహాయం, SIP మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మరియు రోజువారీ ఖర్చులకే సరిపోతోంది. ఈ ఖర్చులన్నీ పోగా నెలాఖరుకు చేతిలో కేవలం ₹5,000 నుంచి ₹8,000 వరకు మాత్రమే ఉంటోందని ఆయన తెలిపాడు. ఏదైనా అనుకోని అత్యవసర ఖర్చు వస్తే ఆ మొత్తం కూడా వెనువెంటనే కరిగిపోతోందని వాపోయాడు.

దీంతో, “లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్” (Lifestyle Inflation) అనబడే జీవనశైలి వ్యయాల పెరుగుదల తనను కూడా ముంచేసిందా అని ఆయన ప్రశ్నించుకున్నాడు. అంటే, ఆదాయం పెరిగే కొద్దీ కనీస అవసరాలతో పాటు మన విలాసాలు, అలవాట్లకు అయ్యే ఖర్చులు కూడా క్రమంగా పెరుగుతూ పోతాయి. ఆదాయం ఎన్ని రెట్లు పెరిగినా, దానికి తగ్గట్లుగా ఖర్చులు కూడా పెరిగిపోతే చివరకు మిగిలే మొత్తం ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కనీసం రెండు మూడు నెలల పాటు అయ్యే ప్రతి పైసా ఖర్చును రాసి చూస్తే డబ్బంతా ఎక్కడికి పోతోందో అర్థమవుతుందని కొందరు సూచించగా.. జీతం పెరిగిన వెంటనే జీవనశైలిని ఒక్కసారిగా మార్చేయకుండా, ఆడంబరాలకు పోకుండా పొదుపును పెంచుకోవడం మంచిదని మరికొందరు సలహా ఇచ్చారు.


Posted

in

by

Tags: