7 ఏళ్లే.. కానీ రిపోర్టింగ్ చూస్తే అవాక్కవుతారు.! వర్షంతో నీటమునిగిన సొసైటీని బాల్కనీ నుంచే లైవ్ రిపోర్ట్ చేసిన చిన్నారి.! వీడియో చూసిన నెటిజన్ల రియాక్షన్ వేరే లెవల్.!

వర్షం కురిస్తే పెద్దవాళ్లు వాతావరణ సమాచారం, రోడ్లపై నిలిచిన వరద నీరు వంటి వివరాల కోసం వార్తలు చూడటం సహజం.

కానీ ఇక్కడ ఓ 7 ఏళ్ల చిన్నారి, వర్షం తర్వాత తమ రెసిడెన్షియల్ సొసైటీలో ఏర్పడిన దుస్థితిని స్వయంగా రిపోర్టర్‌గా మారి కళ్లకు కట్టినట్లు చిత్రీకరించింది. బాల్కనీలో నిలబడి చుట్టుపక్కల పరిసరాలను మొబైల్‌లో రికార్డ్ చేస్తూ ఆమె ఇచ్చిన సహజసిద్ధమైన లైవ్ రిపోర్టింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆ చిన్నారి తమ గేటెడ్ కమ్యూనిటీ అంతటా వర్షపు నీరు ఎలా నిలిచిపోయిందో చూపిస్తుంది. “మీకు ఏం కనిపిస్తోంది?” అని ప్రశ్నిస్తూ, చుట్టూ మురికి నీరు నిండిపోయి ఉన్న వైనాన్ని తన ముద్దు ముద్దు మాటలతో వివరించింది. అంతేకాకుండా అక్కడి ఇళ్లు, దెబ్బతిన్న రోడ్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న ఇటుకలను కూడా కెమెరా తిప్పి చూపించింది. ఆమె మాటల్లోని సహజమైన ఆత్మవిశ్వాసం, టీవీ జర్నలిస్టులను తలపించేలా ఆమె వార్తలను అందించిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ వీడియోను చిన్నారి తల్లి నీతూ ఖండేల్‌వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న మరో మొబైల్ ఫోన్‌ను తీసుకుని ఆ పాప స్వయంగా ఈ వీడియోను రికార్డ్ చేసిందని ఆమె పేర్కొన్నారు. తన కుమార్తెకు ఎప్పటి నుంచో సొంతంగా ఒక పాడ్‌కాస్ట్ (Podcast) ప్రారంభించాలనే కోరిక ఉందని, ఈ వీడియో చూసిన తర్వాతే ఆమెలోని అద్భుతమైన వాక్చాతుర్యాన్ని తాను గుర్తించానని ఆమె తెలిపారు.

చిన్నారి ఆత్మవిశ్వాసాన్ని పలువురు ప్రశంసిస్తున్నప్పటికీ.. ఇంత చిన్న వయసులోనే పిల్లలను సోషల్ మీడియాకు పరిచయం చేయడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. లైక్‌లు, కామెంట్లపై పిల్లలు అతిగా ఆధారపడే పరిస్థితి రాకుండా చూసుకోవాలని, తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే మొబైల్ వాడకాన్ని అనుమతించాలని సూచించారు. ఏది ఏమైనా, 7 ఏళ్ల వయసులోనే ఇంతటి ఆత్మవిశ్వాసంతో జర్నలిస్టులా రిపోర్టింగ్ చేసిన ఆ బుడతడి వీడియో మాత్రం నెట్టింట విశేష ఆదరణ పొందుతోంది.


Posted

in

by

Tags: