“కొత్త డబ్బా తెరిస్తే అందులో పురుగులు పాకుతున్నాయి బాబోయ్!”.. ప్రొటీన్ పౌడర్‌లో షాకింగ్ దృశ్యం చూసిన బిపాసా బసు.. మద్దతుగా గళమెత్తిన ప్రీతి జింటా..!!!

బాలీవుడ్ ప్రముఖ నటి బిపాసా బసు, తాను తాజాగా కొనుగోలు చేసిన ప్రముఖ బ్రాండ్ ప్రొటీన్ పౌడర్ డబ్బాను తెరవగానే అందులో చిన్నచిన్న పురుగులు పాకడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఫిట్‌నెస్, ఆరోగ్యం కోసం తాను కొనుగోలు చేసిన ఆ పౌడర్‌లో పురుగులు తేలియాడుతుండటం చూసిన ఆమె.. తన వేలిపై, గ్లాసు నీటిలో కలిపిన పౌడర్‌లో ఆ పురుగులను స్పష్టంగా చూపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అంతేకాకుండా, “మేము కొనుగోలు చేసే ఉత్పత్తుల్లో కల్తీ లేదా పాడైపోయిన వస్తువులు లేకుండా అరికట్టడానికి మీరే మాకున్న ఏకైక ఆశ” అంటూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారామ్ ముండేను ట్యాగ్ చేస్తూ బిపాసా బసు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు.

ఈ ఉదంతం సోషల్ మీడియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టించగా, మరో అగ్ర నటి ప్రీతి జింటా కూడా ఆహార భద్రతా చర్యల్లో కఠినంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి తుకారామ్ ముండేకు తన పూర్తి మద్దతును ప్రకటించారు.

ఇప్పటికే నటి శ్వేతా తివారీ వంటి ప్రముఖులు కూడా తాము ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో పురుగులు వచ్చాయంటూ ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉండగా, తాజాగా బిపాసా బసుకు ఎదురైన ఈ అనుభవం సినీ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

ప్రజలు నిత్యం వాడే నిత్యావసరాలలో, వేల రూపాయలు వెచ్చించి కొనే హెల్త్ సప్లిమెంట్లలో ఇంతటి నిర్లక్ష్యం చోటుచేసుకోవడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రముఖ నటీమణులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఈ ఘటనపై దృష్టి సారించిన ఆహార భద్రతా శాఖ అధికారులు, సంబంధిత ప్రొటీన్ పౌడర్ బ్రాండ్ మరియు అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటారనే ఆశాభావంతో నెటిజన్లు ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: