సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం జనం చేస్తున్న పిచ్చి చేష్టలకు హద్దూ అదుపు లేకుండా పోయింది.
రోజూ ఏదో ఒక విచిత్రమైన లేదా ప్రమాదకరమైన స్టంట్ వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఆ కోవలోనే, తాజాగా ఓ వ్యక్తి చేసిన ప్రమాదకర విన్యాసం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
సాధారణంగా చాలామంది బీడీ లేదా సిగరెట్ను నోట్లో పెట్టుకుని పొగ తాగడం మనం చూస్తుంటాం. కానీ, ఈ వైరల్ వీడియోలో కనిపించే వ్యక్తి వాటన్నింటినీ మించిపోయాడు. నోటితో పీల్చడానికి బదులుగా, తన రెండు ముక్కు రంధ్రాల్లో కలిపి ఏకంగా 8 బీడీలను దూర్చుకుని, ముక్కుతో పొగను లోపలికి పీల్చి నోటి ద్వారా బయటకు వదిలాడు.
వైరలవుతున్న ఆ వీడియోలో.. కెమెరా ముందు కూర్చున్న ఆ వ్యక్తి, తన ముక్కులో 8 బీడీలను వరుసగా పెట్టుకున్నాడు. అనంతరం ముక్కు ద్వారా పొగను బలంగా లోపలికి లాగి, నోటి ద్వారా గుప్పున బయటకు వదిలాడు. ప్రారంభంలో ఇది చూడటానికి వింతగా అనిపించినప్పటికీ, వీడియో చివరి భాగం మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పొగ పీల్చిన కొద్ది సెకన్లలోనే అతడికి తీవ్రమైన శ్వాసతిప్పలు మొదలై, కళ్ల వెంట నీళ్లు కారుతూ భయంకరంగా దగ్గు రావడం ప్రారంభమైంది. అంతటితో ఆ వీడియో ముగిసింది.
సాధారణంగానే బీడీ, సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి తీవ్ర హానికరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది ఇలా ముక్కు ద్వారా పొగను పీల్చడం శ్వాసనాళాలు, ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీసి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుంది. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తాపత్రయంతో జనం తమ విలువైన ఆరోగ్యాన్నే పణంగా పెట్టడం ఎంతటి మూర్ఖత్వమో ఈ ఘటన తెలియజేస్తోంది. ఏ స్టంట్ కూడా అమూల్యమైన ప్రాణం కంటే ఎక్కువ కాదన్నది నగ్నసత్యం.
ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట దావానలంలా వ్యాపిస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కామెంట్ల రూపంలో ఏకిపారేస్తున్నారు. “ఇకనైనా ఆపండి బాస్.. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు ఊపిరాడట్లేదు!” అని ఒకరు, “క్యాన్సరే ఇతన్ని చూసి భయపడి పారిపోయేలా ఉంది!” అని మరొకరు ఎద్దేవా చేశారు. రీల్స్ కోసం జనం నిజంగానే పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారంటూ నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
