“రెండేళ్లుగా నెట్‌వర్క్ రావట్లేదని భగ్గుమన్న గ్రామస్తులు.. మొబైల్ టవర్ సిబ్బందిని టవర్‌కే కట్టేసిన వైనం.. అధికారులను రప్పించాలంటూ హల్‌చల్.. నెట్టింట వైరలవుతున్న షాకింగ్ వీడియో.!!!”

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్‌లో, రెండేళ్లుగా మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఓ మొబైల్ టవర్ టెక్నీషియన్‌ను బంధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

హర్దౌలీ గ్రామంలో గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా మొబైల్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో విసిగిపోయిన గ్రామస్తులు, అక్కడికి విధుల్లో భాగంగా వచ్చిన ఉద్యోగిని అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.

నెట్‌వర్క్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, టెలికాం సంస్థ ఉన్నతాధికారులు నేరుగా ఇక్కడికి రావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆగ్రహం కట్టలు తెంచుకున్న కొందరు, ఆ ఉద్యోగిని ఏకంగా మొబైల్ టవర్‌కే కట్టేశారు. రెండేళ్లుగా 5జీ సేవలు అందకపోవడంతో ఫోన్ కాల్స్ మాట్లాడటానికి, ఇంటర్నెట్ వాడటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్‌కు కట్టేసి ఉన్న ఉద్యోగిని విడిపించి సురక్షితంగా స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తులపై విచారణ చేపట్టారు. ఉద్యోగిని బంధించి కట్టేసిన ఘటనపై తగిన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఫతేపూర్ పోలీసులు తెలిపారు.

రెండేళ్లుగా నెట్‌వర్క్ సమస్య కొనసాగుతోందని గ్రామస్తులు చెబుతుండగా, అసలు సమస్య ఎందుకు పరిష్కారం కాలేదనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, సమస్య పరిష్కారం కోసం ఓ సాధారణ ఉద్యోగిని ఇలా బంధించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags: