కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలోని మలయిన్కీళ్ పరిధిలో, ఓ కన్నతల్లే తన ఏడాదిన్నర పసికందును కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఉదంతం తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.
విలవూర్కల్ గ్రామంలోని ఓ ఇంట్లో గత గురువారం సాయంత్రం 3:30 నుండి 4:30 గంటల మధ్య ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. క్రిస్టీ అనే ఆ మహిళ, ఇంటి పడకగది తలుపును లోపలి నుంచి గడియ పెట్టుకుని, అక్కడ నిద్రిస్తున్న తన చిన్నారి మెడపై కత్తితో కిరాతకంగా దాడి చేసింది.
తీవ్ర రక్తస్రావమైన ఆ చిన్నారిని స్థానికులు రక్షించి, మొదట విలవూర్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు; అనంతరం 108 అంబులెన్స్ ద్వారా తిరువనంతపురంలోని ఎస్ఏటీ (SAT) ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు, ఆ పాప అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ఎంతసేపటికీ తల్లీబిడ్డ గది బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఓ బంధువు వెళ్లి తలుపు తట్టారు. అప్పుడు తలుపు తెరిచి బయటకు వచ్చిన క్రిస్టీ.. తానే స్వయంగా బిడ్డను చంపేశానని చెప్పడంతో బంధువులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. కుటుంబ కలహాల వల్లే ఈ ఘోరానికి ఒడిగట్టిందా లేక మరేదైనా మానసిక/ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
