చైనాలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్.. భార్యలతో కలిసి షాపింగ్‌కు వచ్చే భర్తల కోసం ఓ సరికొత్త వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
భార్య దుకాణాల్లో గంటల తరబడి వస్తువులను చూస్తూ షాపింగ్ చేస్తున్నప్పుడు, భర్తలు బయట నిల్చుని పడిగాపులు కాయడం సాధారణంగా కనిపించే దృశ్యమే. “ఇంకా ఎంత సేపు పడుతుంది?” అనే ప్రశ్నతో షాపింగ్ సమయంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి అలకలు, గిల్లికజ్జాలు రావడం కూడా సహజమే. వీటికి చెక్ పెట్టేందుకే ఈ మాల్ యాజమాన్యం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.
చైనాలోని షాంఘై నగరంలో ఉన్న ప్రముఖ ‘గ్లోబల్ హార్బర్’ షాపింగ్ మాల్లో.. మహిళలు నిశ్చింతగా షాపింగ్ చేసుకునేందుకు, వారితో పాటు వచ్చే పురుషులకు చక్కని వినోదం అందించేందుకు ప్రత్యేక రెస్ట్ పాడ్లను ఏర్పాటు చేశారు. “హజ్బెండ్ రెస్ట్ హ్యాచెస్” (Husband Rest Hatches) అని పిలిచే ఈ చిన్నపాటి గదుల్లో భర్తలు హాయిగా విశ్రాంతి తీసుకోవడమే కాకుండా వీడియో గేమ్‌లు కూడా ఆడుకోవచ్చు. అంతేకాకుండా, టీవీ చూస్తూ ఆహ్లాదంగా సమయాన్ని గడిపేలా అత్యాధునిక సదుపాయాలను కల్పించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా భార్య బట్టలు, చెప్పులు, బ్యాగులు, మేకప్ వస్తువులు వంటివి ఒక్కొక్కటిగా చూసి ఎంపిక చేసుకునే సమయంలో.. బయట వేచి ఉండే భర్తలు తీవ్ర అసహనానికి, విసుగుకు గురవుతుంటారు. అయితే ఈ సరికొత్త సదుపాయం ఉంటే, భార్య తనకు నచ్చిన వస్తువులను తీరిగ్గా ఎంపిక చేసుకునేలోపు.. భర్త కూడా ఇక్కడ తనకు నచ్చిన వీడియో గేమ్స్ ఆడుకుంటూ టైమ్ పాస్ చేయవచ్చు. దీనివల్ల “ఎంత సమయం పడుతుంది?” అనే భర్తల రొటీన్ ప్రశ్నకు తాత్కాలికంగా ఫుల్స్టాప్ పడుతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
షాపింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కరి వేగం, ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, ఇలాంటి విశ్రాంతి కేంద్రాలు ఇద్దరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ సమయం షాపింగ్ చేయాలనుకునే మహిళలకు ఎలాంటి హడావుడి లేకుండా వస్తువులను ఎంపిక చేసుకునే వెసులుబాటు దక్కుతుంది. అదే సమయంలో భర్తలు కూడా విసుగు చెందకుండా సమయాన్ని ఆస్వాదించవచ్చు. ఈ సరికొత్త వినూత్న ప్రయత్నానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటుండగా.. భారతీయ మాల్స్‌లోనూ ఇలాంటి సదుపాయం తీసుకొస్తే భర్తలకు అంతకంటే ఆనందం మరొకటి ఉండదని నెటిజన్లు చలోక్తులు విసురుతున్నారు.
