రాజస్థాన్లోని జైపూర్ నగరంలోని కర్ధనీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘోర విషాదం ఆ ప్రాంత ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యతో పాటు ముగ్గురు కుమార్తెల తలలపై సిమెంట్ దిమ్మతో మోది అత్యంత పాశవికంగా హతమార్చి పరారయ్యాడు.
జైపూర్లోని గోవింద్ వాటికా ప్రాంతంలో నివాసముంటున్న రాహుల్ ఝా అనే వ్యక్తి, శుక్రవారం తెల్లవారుజామున తన భార్య గీతా ఝాతో పాటు కుమార్తెలు నందిని, రాధిక, గౌరీ (17 నుండి 23 ఏళ్ల వయస్సు గలవారు) గాఢ నిద్రలో ఉండగా.. వారి తలలపై సిమెంట్ దిమ్మతో విచక్షణారహితంగా బాది హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత డెలివరీ బాయ్ నుంచి పాల ప్యాకెట్లు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు.
పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాహుల్ ఝా ఉదయం 7 గంటల ప్రాంతంలో ఏమీ తెలియనట్లు తన 85 ఏళ్ల వృద్ధ తండ్రికి నిదానంగా టీ పెట్టి ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి నుంచి పరారయ్యాడు.
ఉదయం 10 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ హత్యలకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రాహుల్ ఝా కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
