బడి పిల్లల్లో జంక్ ఫుడ్ తినే అలవాటును మాన్పించేందుకు ఉపాధ్యాయులు ఒక విచిత్రమైన, తీవ్రమైన పద్ధతిని ప్రయోగించారు.
విద్యార్థులకు చాక్లెట్లు, చిప్స్, లాలీపాప్‌ల వంటి తినుబండారాలను ఇచ్చిన తర్వాత.. వారికి నకిలీ ‘అల్ట్రాసౌండ్ అబ్డామినల్ స్కాన్’ (కడుపు స్కానింగ్) పరీక్ష చేశారు. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై చూపించిన ఆ ఫేక్ స్కాన్‌లో.. జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపులో పురుగులు పాకుతున్నట్లు రూపొందించిన యానిమేషన్ విజువల్స్‌ను టీచర్లు పిల్లలకు చూపించారు.
అయితే ఉపాధ్యాయుల ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. స్కానింగ్ స్క్రీన్‌పై పురుగులు పాకడం చూసిన చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురై, భయంతో గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన 39 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ ఘటనపై పలువురు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. “పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పించడం మంచిదే; కానీ, పచ్చి అబద్ధాలు చెబుతూ, వారిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసి నేర్పించడం చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది” అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అదే సమయంలో, మరికొందరు మాత్రం “జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలను పిల్లలకు గట్టిగా అర్థమయ్యేలా చెప్పేందుకు ఇలాంటి పద్ధతులు అవసరమే” అంటూ భిన్నంగా స్పందిస్తున్నారు.
