ఆహార డెలివరీ మార్కెట్లో పోటీ తీవ్రమవుతున్న వేళ, ఎటర్నల్ (Eternal) గ్రూప్నకు చెందిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) వినియోగదారులకు సరికొత్త షాక్ ఇచ్చింది.
ఆహారం ఇంటికి చేరిన తర్వాత నగదు చెల్లించే ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (COD) విధానాన్ని ఎంచుకునే కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది.
కస్టమర్లు తమ ఆర్డర్ అందిన తర్వాత నగదు చెల్లించే సమయంలో, బిల్లు వివరాల్లో “పే ఆన్ డెలివరీ ఫీజు” (Pay-on-delivery fee) పేరిట దీనిని ప్రత్యేకంగా చూపుతోంది. సాధారణంగా ఈ రుసుమును రూ. 5గా వసూలు చేస్తున్నప్పటికీ, కొందరు యూజర్ల నుంచి రూ. 7 నుంచి రూ. 20 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆన్లైన్ లేదా డిజిటల్ పద్ధతిలో ముందుగానే చెల్లింపులు చేసే కస్టమర్లకు ఈ అదనపు భారం ఉండదు.
భారత ఫుడ్ డెలివరీ రంగంలో రాపిడో వారి ‘ఓన్లీ’, ఫ్లిప్కార్ట్ వారి ‘ఈట్ ఇన్’, ‘స్విష్’ వంటి కొత్త సంస్థల ప్రవేశంతో పోటీ మరింత తీవ్రమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇప్పటికే అమల్లో ఉన్న ప్లాట్ఫామ్ ఫీజు, ప్యాకింగ్ ఛార్జీలు, జీఎస్టీలతో పాటు జొమాటో ఈ సరికొత్త అదనపు ఛార్జీని కూడా జోడించింది. దీనికి ప్రధాన పోటీదారు అయిన స్విగ్గీ (Swiggy) ఇంకా ఇలాంటి రుసుములను ప్రవేశపెట్టలేదు.
జొమాటో రోజుకు సగటున 23 నుంచి 25 లక్షల ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ఇందులో కొంత శాతం మంది కస్టమర్లు క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకున్నా, ఆర్డర్కు రూ. 5 చొప్పున లెక్కించినా సంస్థకు రోజుకు సుమారు రూ. 1.15 కోట్ల నుంచి రూ. 1.25 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
గత 2023లో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారాలు ఈ ప్లాట్ఫామ్ ఫీజులను ప్రవేశపెట్టి, క్రమంగా పెంచుకుంటూ వచ్చాయి. జొమాటో ఇప్పటికే తన ప్లాట్ఫామ్ ఫీజును రూ. 12.5 నుంచి రూ. 14.99 వరకు పెంచింది. ప్రతిరోజూ లక్షలాది ఆర్డర్లు జరుగుతుండటంతో, ఇలాంటి స్వల్ప మొత్తాల పెంపు కూడా సంస్థల వార్షిక ఆదాయాన్ని వందల కోట్లలో పెంచేందుకు దోహదపడుతున్నాయి.
