“ప్రపంచాన్ని కళ్లారా చూడాలి!” అనే కోరిక.. 33 ఏళ్లుగా అవిశ్రాంతంగా ప్రయాణించిన వ్యాపారవేత్త..! 233 దేశాలు, ప్రాంతాల సందర్శన పూర్తి.. ఇందుకోసం ఏకంగా రూ.14 కోట్లు ఖర్చు..!

ప్రపంచాన్ని చుట్టిరావాలనేది చాలామంది కల. అయితే ఆ కలను ఏకంగా 33 ఏళ్ల పాటు నిరంతరం కొనసాగించి.. ప్రపంచంలోని 233 దేశాలు, ప్రత్యేక ప్రాంతాలు మరియు కేంద్రపాలిత భూభాగాలను సందర్శించి వచ్చారు చైనాకు చెందిన వ్యాపారవేత్త చెన్ జిన్‌వీ (Chen Jinwei).

53 ఏళ్ల ఆయన, ఇటీవల పెరూ దేశ పర్యటనను ముగించుకుని తన సొంత ఊరైన జూజీ (Zhuji)కి చేరుకున్నారు.

చెన్ తన ప్రపంచ యాత్రను 1993లో సింగపూర్, మలేషియా, థాయిలాండ్ పర్యటనలతో ప్రారంభించారు. ఆ సమయంలో నేటి స్థాయిలో ఇంటర్నెట్ సదుపాయాలు విస్తృతంగా అందుబాటులో లేవు. దాంతో పుస్తకాల్లో చదవడం లేదా ఇతరులు చెప్పడం ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవడం కంటే, స్వయంగా తానే నేరుగా వెళ్లి అక్కడి ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతిని ప్రత్యక్షంగా చూడాలనే తపనతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.

మెషినరీ సంస్థను నడుపుతున్న చెన్.. తన వ్యాపారాన్ని, కుటుంబ బాధ్యతలను ఏమాత్రం విస్మరించకుండా ఈ ప్రయాణాలను కొనసాగించారు. ఒక నెల రోజుల పాటు వ్యాపారం, కుటుంబాన్ని చూసుకుంటూ, తర్వాతి నెల పర్యటనలకు వెళ్లే ప్రణాళికను క్రమం తప్పకుండా పాటించారు. ఈ 33 ఏళ్లలో తన ప్రపంచ పర్యటనల కోసం ఆయన సుమారు 10 మిలియన్ల చైనీస్ యువాన్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.14 కోట్లు ఖర్చు చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అంటార్కిటికా వెళ్లేందుకు చేసిన మొదటి ప్రయత్నం విఫలమైనప్పటికీ, ఆ తర్వాత మళ్లీ ప్రయత్నించి అక్కడికి చేరుకున్నారు. ఆఫ్రికాలో మలేరియా బారిన పడటంతో పాటు, గ్రీస్‌లో సంభవించిన భూకంపాన్ని కూడా ఎదుర్కొన్నట్లు సమాచారం. 198 దేశాల కరెన్సీ నాణేలను సేకరించిన చెన్, వాటన్నింటినీ చైనాలోని షు షియాకే స్మారక మందిరానికి విరాళంగా అందజేశారు. ఇకపై తన పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Posted

in

by

Tags: