“వన్ సైడ్ లవ్‌లో ఇంతటి దారుణమా?! స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న విద్యార్థిని కిడ్నాప్.. అడవిలోకి తీసుకెళ్లిన సీనియర్.. రాత్రంతా అక్కడే నిర్బంధించిన వైనం.!!!”

జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా జిల్లాలో పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్న 11వ తరగతి విద్యార్థినిని, వన్‌సైడ్ లవ్ నెపంతో సీనియర్ విద్యార్థితో సహా ఐదుగురు వ్యక్తులు కలిసి బొలెరో కారులో కిడ్నాప్ చేసిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

సెప్టెంబర్ 8వ తేదీన సిసాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్‌ఫెని-బోధా ప్రాంతంలో విద్యార్థిని నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమెను బలవంతంగా కారులోకి లాక్కెళ్లారని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రియా ఒరాన్.. అదే పాఠశాలలో చదువుతున్న సీనియర్ విద్యార్థి అని పోలీసులు వెల్లడించారు. బాలికను కిడ్నాప్ చేయడానికి ముందే అతడు పక్కా ప్లాన్‌తో బొలెరో కారును సిద్ధం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. విద్యార్థినిని అపహరించిన సమయంలో ఆమెతో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులు తక్షణమే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా అరంగి అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో విద్యార్థినిని సురక్షితంగా రక్షించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో విద్యార్థినిని రాత్రంతా ఆ అటవీ ప్రాంతంలోనే బంధించినట్లు తేలింది. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత, అతడు ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన నలుగురు యువకులను కూడా అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్‌కు ఉపయోగించిన బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ప్రియా ఒరాన్, మున్నా ఒరాన్, బీరేంద్ర ఒరాన్, రాజేష్ ఒరాన్ మరియు ఆశిష్ లోహ్రా అనే ఐదుగురిని అరెస్ట్ చేశారు. బాధిత విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు, ఈ ఘటన వెనుక ఉన్న ఇతర వివరాలు మరియు నేర తీవ్రతపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులందరినీ న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.


Posted

in

by

Tags: