బీహార్ రాష్ట్రం రోహ్తాస్ జిల్లాలో 12 ఏళ్ల క్రితం హత్యకు గురైందని భావించిన ఓ మహిళ.. ప్రస్తుతం జార్ఖండ్లో సజీవంగా పట్టుబడిన ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది.
గత 2014లో ససారాం సమీపంలో సరస్వతి దేవి అనే మహిళ ఉన్నట్టుండి అదృశ్యమైంది. కొద్ది రోజుల తర్వాత సమీపంలోని కాలువలో గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం తన సోదరి సరస్వతి దేవిదేనని ఆమె సోదరుడు గుర్తించడంతో పోలీసులు అనుమానాస్పద హత్య కేసు నమోదు చేశారు.
అనంతరం సరస్వతి దేవి భర్త అరుణ్ మెహతా, మామ దిలీప్ మెహతా, మరిది గోవింద్ కుమార్ సహా అత్తింటికి చెందిన 8 మందిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు భర్త, మామ, మరిదిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసు కారణంగా ఆ కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి జైలు జీవితాన్ని, కోర్టు మెట్లను ఎక్కాల్సి వచ్చింది. తాము చేయని నేరానికి నిష్కారణంగా శిక్ష అనుభవించామంటూ బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో, దాదాపు 12 సంవత్సరాల తర్వాత సరస్వతి దేవి బతికే ఉందన్న సమాచారం కుటుంబ సభ్యులకు అందింది. ఆ సమాచారం ఆధారంగా దేహ్రీ ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విచారణ జరిపి జార్ఖండ్ రాష్ట్రం గఢ్వా జిల్లాకు చేరుకున్నారు. అక్కడ కండి పోలీస్ స్టేషన్ పరిధిలోని లబారి గ్రామంలో సదరు మహిళను పోలీసులు గుర్తించారు. ఆమె తన పేరును ‘శాంతి దేవి’గా మార్చుకుని, రట్టు సింగ్ అనే వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
సరస్వతి దేవి సజీవంగా దొరకడంతో.. 2014లో కాలువలో లభించిన ఆ గుర్తుతెలియని మహిళ మృతదేహం ఎవరిదనే పెను ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ మృతదేహం సరస్వతి దేవిదేనని అప్పట్లో ఎలా నిర్ధారించారు? పోస్ట్మార్టం మరియు డీఎన్ఏ వంటి ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రక్రియల్లో లోపాలు జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర పునర్విచారణ జరపాలని బాధితుడైన భర్త కుటుంబం డిమాండ్ చేస్తోంది. తదుపరి దర్యాప్తులో పుష్కర కాలంగా వీడని ఈ అంతుచిక్కని మిస్టరీకి తెరపడుతుందని భావిస్తున్నారు.

Leave a Reply