జమ్మూ కశ్మీర్లోని సోనామార్గ్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చిత్రీకరించడం కోసం కొందరు యువకులు మహీంద్రా స్కార్పియో కారును ఉధృతంగా ప్రవహిస్తున్న సింధు నదిలోకి పోనిచ్చిన ఘటన తీవ్ర దుమారాన్ని, కలకలాన్ని రేపింది.
హోటల్ సింధు రిసార్ట్స్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. ఏదో సాహసం చేస్తున్నామనే భ్రమతో ఆ యువకులు కారును నేరుగా నదిలోకి దించారు. అయితే, నదిలోని హిమపాతం వల్ల ఏర్పడిన తీవ్రమైన ప్రవాహ తాకిడికి ఆ కారు బురద నీటిలో చిక్కుకుపోయింది. పైకి రాలేకపోవడంతో కారు లోపల ఉన్న యువకులు బయటకు రాలేక ప్రాణభయంతో అల్లాడిపోయారు. సమాచారం అందిన వెంటనే జమ్మూ కశ్మీర్ పోలీసులు, స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు.
తీవ్ర శ్రమ అనంతరం కారులో చిక్కుకున్న యువకులందరినీ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత నదీ ప్రవాహంలో కూరుకుపోయిన స్కార్పియో కారును కూడా తాళ్ల సాయంతో బయటకు లాగారు. కేవలం కొన్ని లైకులు, వ్యూస్ కోసం తమ నిండు ప్రాణాలనే పణంగా పెడుతూ ఈ యువకులు చేసిన ఈ నిర్లక్ష్యపు చర్య తాలూకు వీడియో ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు.. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జమ్మూ కశ్మీర్ పోలీసులను డిమాండ్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
