తాను ఎంతగానో ఆరాధించే అభిమాన తార మ్యూజిక్ కాన్సర్ట్ (సంగీత కచేరీ) చూసేందుకు వెళ్లి వచ్చిన ఓ 17 ఏళ్ల బాలిక చిన్న ప్రయాణం.. ఆమె కుటుంబాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది.
రోజూ గడవడానికి ప్రభుత్వం అందించే సంక్షేమ సాయంపైనే ఆధారపడి బతుకుతున్న ఆ కుటుంబానికి, బాలిక తన పాకెట్ మనీ పొదుపుతో చేపట్టిన ఈ చిన్న విహారయాత్ర తీరని తలనొప్పిని తెచ్చిపెట్టింది.
చైనాలోని జియాంగ్సీ ప్రావిన్స్‌కు చెందిన ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఈ బాలిక ఓ సాంకేతిక పాఠశాలలో చదువుకుంటోంది. తల్లిదండ్రులిద్దరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, వారి కుటుంబం ప్రభుత్వం ఇచ్చే దారిద్య్రరేఖ దిగువన ఉన్నవారి సంక్షేమ నిధులపైనే ఆధారపడి జీవిస్తోంది. వీరికి నెలకు సుమారు 2,000 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.28,000) ఆర్థిక సహాయం అందుతోంది. ఈ క్రమంలో, హాంకాంగ్‌లో జరిగిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న బాలిక.. దానికి అయ్యే ఖర్చులను తన సొంత పాకెట్ మనీ నుంచే భరిస్తానని కుటుంబానికి తెలిపింది.
నెలల తరబడి తన జేబు ఖర్చుల డబ్బును పొదుపు చేసిన ఆ బాలిక, ఆగస్టు నెలాఖరు నాటికి దాదాపు 3,000 నుంచి 5,000 యువాన్ల వరకు జమ చేసుకుంది. అయితే ఆమె ప్రయాణం ప్రారంభించకముందే స్థానిక సామాజిక భద్రతా అధికారులు ఆ కుటుంబానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇతర దేశాలకు లేదా విలాసవంతమైన విహారయాత్రలకు వెళ్లడం ప్రభుత్వ ఆర్థిక సాయం పొందే అర్హతపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఎంతగా వారించినా వినకుండా, ఆ బాలిక హాంకాంగ్ వెళ్లి సంగీత కచేరీలో పాల్గొని తిరిగొచ్చింది.
కానీ ఆమె తిరిగి రావడమే ఆలస్యం.. సమస్యలు మొదలయ్యాయి. డిజిటల్ డేటాబేస్ ద్వారా ట్రావెల్ రికార్డులను పసిగట్టిన స్థానిక అధికారులు, ఆ కుటుంబానికి సంక్షేమ నిధులు పొందే అర్హత ఉందా లేదా అనే అంశంపై పునఃసమీక్ష ప్రారంభించారు. ఆర్థిక సాయం ఆగిపోతే వచ్చే నెల ఇల్లు ఎలా గడుస్తుందన్న దిగులుతో తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. బాలిక అవగాహనారాహిత్యమా లేక ప్రభుత్వ నిబంధనలపై స్పష్టత లేకపోవడమా అన్న సందిగ్ధంలో కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతున్నారు.
చైనాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సంక్షేమ పథక నిబంధనలు ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంటాయి. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సహాయం పొందే కుటుంబాల ఖర్చుల వివరాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిని దాటితే నిధులను రద్దు చేయవచ్చు. అయితే, సంబంధిత ఆర్థికాభివృద్ధి మండల యంత్రాంగం సెప్టెంబర్ 7న విడుదల చేసిన ప్రకటనలో.. విచారణ ఇంకా పూర్తి కాలేదని, సహాయ నిధులను తక్షణమే పూర్తిగా రద్దు చేయలేదని స్పష్టం చేసింది. బాలిక చిన్న కోరిక కాస్తా ప్రభుత్వ నిబంధనల ఉచ్చులో చిక్కుకున్న ఈ ఉదంతం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
