ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుమార్తె జహ్రా పెజెష్కియాన్ ఢిల్లీలో జరిగిన ‘బ్రిక్స్ బజార్’ (BRICS Bazaar)ను సందర్శించడం విశేష దృష్టిని ఆకర్షించింది.
భారతదేశం వహించిన బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో వివిధ దేశాలకు చెందిన సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులు, కళాఖండాలు, సాంస్కృతిక విశేషాలు కొలువుదీరాయి.
ఢిల్లీలోని నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం అండ్ హస్తకళా అకాడమీలో ఆరు రోజుల పాటు ఈ బ్రిక్స్ బజార్ కొనసాగింది. దాదాపు 18 దేశాలకు చెందిన సంప్రదాయ కళలు, చేతివృత్తుల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు. 40 మందికి పైగా హస్తకళాకారులు, డిజైనర్లు, సృజనాత్మక రంగ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.
ఈ ప్రదర్శనలో జహ్రా పెజెష్కియాన్ భారత సంప్రదాయ కళలు, చేతివృత్తుల ఉత్పత్తులను ఎంతో ఆసక్తిగా పరిశీలించినట్లు కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఆమె ధరించిన అతి సాధారణ దుస్తులు, ఎలాంటి ఆడంబరాలూ లేని సహజ సిద్ధ రూపం అక్కడికి వచ్చిన ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. భారతదేశ ఘనమైన కళలు, చేతివృత్తులు, సంస్కృతిని నేరుగా తెలుసుకునే చక్కని అవకాశంగా ఆమె పర్యటన నిలిచింది.
బ్రిక్స్ బజార్ అనేది కేవలం ఉత్పత్తులను విక్రయించే మార్కెట్గా మాత్రమే కాకుండా.. సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని, స్నేహపూర్వక సంబంధాలను ప్రతిబింబించే వేదికగా మారింది. భారత సంప్రదాయ కళలతో పాటు వివిధ దేశాల విభిన్న సంస్కృతులను ఒకే వేదికపై వీక్షించే అరుదైన అవకాశం ఈ ప్రదర్శన ద్వారా లభించింది.
