“అమ్మా.. కాపాడు..!” కళ్లముందే బోల్తాపడ్డ ఇటుకల ట్రాక్టర్.. 5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం.. గుండెలు పిండేసే విషాదం.!!

ఘజియాబాద్‌లోని అర్థలా పరిధిలోని బాలాజీ విహార్ సమీపంలో.. పరిమితికి మించిన లోడుతో వచ్చిన ఇటుకల ట్రాక్టర్-ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడి ఘోర ప్రమాదం సంభవించింది.

ఈ దుర్ఘటనలో బడికి వెళ్తున్న సుమారు 5 లేదా 6 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, ఆమెతో పాటు ఉన్న తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ హృదయ విదారక ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయింది.

బాధిత చిన్నారి ఇనాయా ఎల్‌కేజీ (LKG) చదువుతోంది. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న ఆ చిన్నారి.. తల్లి సుల్తానాతో కలిసి ఫుట్‌పాత్ వెంట నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తోంది. ఆ సమయంలో భారీగా ఇటుకల లోడుతో వేగంగా వచ్చిన ట్రాక్టర్-ట్రాలీకి చెందిన ఒక చక్రం.. రోడ్డు పక్కన పోసి ఉన్న మట్టి కుప్పపైకి ఎక్కింది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ట్రాలీ.. పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న తల్లి, చిన్నారిపైకి ఒరిగి బోల్తా పడింది.

ట్రాలీ బోల్తా పడటంతో అందులోని ఇటుకలన్నీ ఆ తల్లీకూతుళ్లపై పడి, ఇద్దరూ వాటి కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన చిన్నారి ఇనాయా ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. తీవ్రంగా గాయపడిన తల్లి సుల్తానాను స్థానికులు, సహాయక సిబ్బంది హుటాహుటిన రక్షించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


Posted

in

by

Tags: