కేరళలోని కొట్టాయం జిల్లా కురవిలంగడ్ ప్రాంతంలోని సెయింట్ ఫ్రాన్సిస్ మిషన్ హోమ్ ఆవరణలో ఉన్న ఒక చిన్న ఇంట్లో, కుట్టు మిషన్ల శబ్దాల నడుమ ముగ్గురు క్రైస్తవ సన్యాసినులు (నన్స్) తమ జీవితాలను స్వయంగా పునర్నిర్మించుకుంటున్నారు.
న్యాయం కోసం సాగిస్తున్న సుదీర్ఘ న్యాయపోరాటం మధ్య, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వారు ప్రారంభించిన కుట్టు పరిశ్రమ ఇప్పుడు ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది.
2018లో జలంధర్ మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్పై లైంగిక దాడి ఫిర్యాదు చేశారు సిస్టర్ రనీత్ ఎం.జె. ఆమెకు అండగా నిలిచారు సిస్టర్ ఆల్ఫీ, సిస్టర్ అన్సిటా. ఈ కేసులో 2022లో తగిన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో కోర్టు బిషప్ ఫ్రాంకోను నిర్దోషిగా విడుదల చేసింది. అయినప్పటికీ, ఆ తీర్పును సవాలు చేస్తూ సిస్టర్ రనీత్ హైకోర్టులో అప్పీల్ చేసి తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ పోరాటం కోసం వారు చెల్లించిన మూల్యం చాలా పెద్దది. వారి సొంత సభే వారిని వెలివేసింది; ప్రతి నెలా ఇవ్వాల్సిన భత్యాన్ని కూడా నిలిపివేసింది. బ్రతుకుదెరువు కోసం ఎవరి ముందూ చేయి చాచడానికి ఇష్టపడని ఈ ముగ్గురు సోదరీమణులు, తమకు తెలిసిన కుట్టుపనినే జీవనోపాధి ఆయుధంగా మార్చుకున్నారు. అలా రూపుదిద్దుకున్న బ్రాండే ‘స్టాండ్ బై మీ’ (Stand By Me)!
“మొదట్లో మమ్మల్ని ఆదుకోవడానికి ‘సిస్టర్స్ ఇన్ సాలిడారిటీ’ అనే సంస్థ ముందుకొచ్చింది. ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి చేయమని వారు మాకు సూచించారు. అలా ఒకే ఒక్క కుట్టు మిషన్తో మొదలైన ప్రయాణమే ఇది” అని గుర్తుచేసుకున్నారు సిస్టర్ రనీత్. వారు చక్కటి నైట్ డ్రెస్సులు, సల్వార్ కమీజ్లు, అందమైన ఎంబ్రాయిడరీ వర్క్ దుస్తులతో పాటు, కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ల్యాప్టాప్ స్లీవ్లతో కూడిన హ్యాండ్బ్యాగులను తయారుచేస్తున్నారు.
ప్రస్తుతం వీరి వద్ద ఐదు సాధారణ కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ, లాక్-స్టిచింగ్ మిషన్లు ఉన్నాయి. దాతల సహకారంతో ముడిసరుకును సేకరిస్తూ స్వశక్తితో శ్రమిస్తున్నారు. దుస్తుల తయారీతో పాటు, ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కర్రపెండలం, క్యాబేజీ, కాలీఫ్లవర్, అల్లం, పసుపు వంటి పంటలను సాగు చేస్తున్నారు. అలాగే కోళ్లు, బాతులు, పాడి ఆవులను పెంచి, పాలు విక్రయిస్తూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు.
“సభ నుంచి రావాల్సిన నెలకు రూ.5,000 భత్యం కూడా ఇప్పుడు అందడం లేదు. అందుకే వ్యవసాయం చేస్తూ, బట్టలు కుడుతూ మేమే స్వయంగా జీవిస్తున్నాం” అని సిస్టర్ రనీత్ దృఢంగా చెప్పారు. ఇంట్లోని మోటారు పాడవడం వంటి అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది ఎదురైనా, ఎవరినీ ఆశ్రయించకూడదన్న విషయంలో వారు స్పష్టంగా ఉన్నారు.
‘స్టాండ్ బై మీ’ అనేది ఇప్పుడు కేవలం ఒక వస్త్ర బ్రాండ్ మాత్రమే కాదు; లైంగిక హింసకు వ్యతిరేకంగా అణగారిన మహిళల గొంతుకగా, ఒక ఉద్యమంగా మారింది. కొట్టాయం కస్తూర్బా సామాజిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే ‘నిరంగళ్’ ఎగ్జిబిషన్లో వీరి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. సమాజం చేసిన వెలివేతను అధిగమించి, ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న ఈ సిస్టర్ల జీవన ప్రయాణం ఎందరికో ఆదర్శప్రాయం.
