ఏడేళ్ల బంధాన్ని ఒక రెస్టారెంట్ ఫుడ్ బిల్లు పేచీ పేకమేడలా కూల్చేసిన హృదయ విదారక ఘటన ఒకటి నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రియుడే స్వయంగా పిలిచిన విందుకు వెళ్లిన ఒక యువతికి అక్కడ ఊహించని చేదు అనుభవం ఎదురైంది. భోజనం ముగిశాక వచ్చిన సుమారు రూ.6,300 బిల్లును ఆమెనే కట్టాలని ప్రియుడు పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. తాను మాంసాహారం ముట్టనని, తనకోసం కేవలం పన్నీర్ వంటి శాకాహార వంటకాలను మాత్రమే ఆర్డర్ చేశానని చెప్పినా అతడు వినలేదు. బిల్లు మొత్తం చెల్లించాలంటూ ఆమెతో గొడవపడి, అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫోన్ నంబర్ను సైతం బ్లాక్ చేసేశాడు.
వేరే దారిలేక ఆ బిల్లు మొత్తాన్ని తన సొంత డబ్బులతో చెల్లించి, ఒంటరిగానే ఇంటికి చేరుకుంది. డబ్బు పోయిందనే బాధ కంటే, ఏడేళ్లుగా ప్రాణంగా నమ్ముకున్న బంధం ఒక్క క్షణంలో ముక్కలైపోయిందన్న వేదనతో ఆమె కన్నీరుమున్నీరవుతూ సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకుంది.
“డబ్బు లావాదేవీలు వచ్చినప్పుడే మనుషుల అసలు రంగు బయటపడుతుంది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రియుడి అమానవీయ ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ, ఆ యువతికి సానుభూతి తెలుపుతున్నారు.
