రోడ్లపై భిక్షాటన చేసిన బీజేపీ ఎమ్మెల్యే.. వేల కోట్ల ఆస్తి ఉన్నా ఇప్పుడిదేం పని? అవాక్కయిన ప్రజలు..!

మహారాష్ట్రలోనే అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యేగా పేరున్న పరాగ్ షా, ఒక రోజంతా యాచకుడి అవతారమెత్తి రోడ్లపై భిక్షాటన చేసి ఆ ఆహారంతో కడుపు నింపుకున్న సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.

రూ.3,400 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన ఆయన, తనకున్న భద్రత, సకల సౌకర్యాలను పక్కనపెట్టి ఈ వినూత్న అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మేకప్ వేసుకుని యాచకుడిలా ముస్తాబై ప్రజల్లోకి వెళ్లారు.

జైన మతంలో పవిత్రంగా భావించే చాతుర్మాస సమయంలో, పరాగ్ షా గురువైన నమ్రముని ఇచ్చిన సలహా మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిరుపేదల జీవితాలను, వారు ఎదుర్కొనే కష్టాలను స్వయంగా అనుభవించి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దాంతో పరాగ్ షా తన సెక్యూరిటీని, లగ్జరీ జీవితాన్ని వదిలి పూర్తిగా యాచకుడి రూపంలో పలు ప్రాంతాల్లో తిరిగారు.

సాధారణ ప్రజలు గుర్తుపట్టకుండా ఉండే వేషధారణలో రోడ్లపై, రద్దీ ప్రదేశాలలో ప్రజల వద్ద చేయిచాచి భిక్షాటన చేశారు. అలా అడుక్కుని తెచ్చుకున్న ఆహారాన్నే తిన్నారు. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టి, తిరిగి అదే ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలతో తన అనుభవాలను పంచుకున్నట్లు సమాచారం.

పరాగ్ షా ప్రస్తుతం మహారాష్ట్రలోని ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. వేల కోట్ల ఆస్తిపరుడైన ప్రజాప్రతినిధి ఒక రోజంతా బిచ్చగాడిలా జీవించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, కేవలం ఒక్క రోజు లేదా కొన్ని గంటల అనుభవం వల్ల పేదల అసలు కష్టాలు పూర్తిగా అర్థమవుతాయా అంటూ నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, సమాజంలోని అణగారిన వర్గాల జీవితాన్ని స్వయంగా అనుభవించేందుకు ఆయన చేసిన ప్రయత్నం ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశమైంది.


Posted

in

by

Tags: