వారణాసిలోని హెరిటేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో యూరాలజిస్ట్గా పనిచేస్తున్న 40 ఏళ్ల వైద్యుడు శుభాంకర్ గౌతమ్, శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం తీవ్ర కలకలం రేపింది.
అనస్థీషియా (మత్తు) మందును అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆయన మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
బీహార్లోని పాట్నాకు చెందిన డాక్టర్ శుభాంకర్ గౌతమ్, గత మూడేళ్లుగా ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు. ఎయిమ్స్ (AIIMS) నుంచి ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయనకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే, కుటుంబానికి దూరంగా వారణాసిలోని హాస్టల్ గదిలో ఆయన ఒంటరిగానే నివసిస్తున్నారు.
శనివారం ఉదయం విధుల్లో భాగంగా రోగులను పరీక్షించిన అనంతరం, డాక్టర్ గౌతమ్ క్యాంపస్లోని తన గదికి వెళ్లారు. అయితే సాయంత్రం భోజన సమయానికి ఆయన క్యాంటీన్కు రాకపోవడంతో తోటి వైద్యులు ఫోన్ చేశారు. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందిని వెంటబెట్టుకుని ఆయన గది వద్దకు వెళ్లారు.
అప్పటికే గది తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో, తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా డాక్టర్ గౌతమ్ అపస్మారక స్థితిలో పడి ఉండటం కనిపించింది. వెంటనే అక్కడున్న వైద్యులు ఆయనను పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ఆయన గదిలో లభించిన ఆధారాలు, మత్తు మందును ఓవర్డోస్గా ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సూచిస్తున్నాయని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ విషాద ఘటన వెనుక ఏవైనా కుటుంబ కలహాలు కారణమా అనే కోణంతో పాటు పలు అంశాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
