మహారాష్ట్రకు చెందిన 41 ఏళ్ల కృష్ణలాల్ భార్య యామిని, వినాయక చవితి పండుగ సందర్భంగా తమ అపార్ట్మెంట్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమం కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది.
సంఘటన జరిగిన రోజు రాత్రి సుమారు 10 గంటల సమయంలో యామిని డ్యాన్స్ ప్రాక్టీస్కు బయలుదేరుతుండగా, పని ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త కృష్ణలాల్ తనకు భోజనం పెట్టాలని కోరాడు. అయితే ప్రాక్టీస్కు సమయం మించిపోతోందని యామిని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటమాట పెరగడంతో ఆగ్రహానికి గురైన కృష్ణలాల్, భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ దాడిలో మెడ, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో యామిని ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. మొదట్లో ఈ దారుణాన్ని పోలీసులకు తెలియకుండా సహజ మరణంగా చిత్రీకరించి దాచేందుకు కృష్ణలాల్ ప్రయత్నించాడు. అయితే, యామిని మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు.
పోస్ట్మార్టం నివేదికలో ఆమె శరీరంపై అంతర్గత గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు కృష్ణలాల్ను తమదైన శైలిలో విచారించగా, అతడు భార్యను తానే కొట్టి చంపినట్లు అంగీకరించాడు. అనంతరం కృష్ణలాల్పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ దంపతులకు 14 ఏళ్లు, 4 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉండగా, తల్లి మరణించి, తండ్రి జైలుపాలు కావడంతో ఆ పిల్లలు అనాథలుగా మారిన తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
