మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ పరిధిలో చోటుచేసుకున్న ఓ దిగ్భ్రాంతికర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఉతిలా గ్రామానికి చెందిన ఊర్మిళ అనే మహిళ ఇంటికి, ఇరవై ఏళ్ల క్రితం స్నేహితురాలైన భానుమతి అనే మహిళ అకస్మాత్తుగా వెతుక్కుంటూ వచ్చింది.
భర్త చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని చెప్పి ఊర్మిళ సానుభూతిని పొందిన ఆమె, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆ రోజంతా అక్కడే గడిపి వెళ్లింది. స్నేహితురాలిపై ఎలాంటి అనుమానం రాని ఊర్మిళ కూడా ఆమెను ఎంతో ఆప్యాయంగా స్వాగతించి ఆతిథ్యమిచ్చింది.
అయితే, మరుసటి రోజు మళ్లీ వచ్చిన ఆ కిలాడీ మహిళ.. తాను తెచ్చిన కూల్డ్రింక్స్, లడ్డూలలో తీవ్రమైన మత్తుమందు కలిపి ఊర్మిళ కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న అద్దెదారులకు కూడా ఇచ్చింది. వాటిని తిన్న కొద్దిసేపటికే ఊర్మిళ, జితేంద్ర, భావన సహా మొత్తం 7 మంది స్పృహ తప్పి కుప్పకూలిపోయారు.
అందరూ మత్తులోకి జారుకున్నారని నిర్ధారించుకున్న ఆ మహిళ, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునే పనిలో పడింది. ఆ సమయంలో ఆ తినుబండారాలు ఏమీ తినని ఊర్మిళ చిన్న కుమార్తె కళ్లు తెరిచి చూడటంతో ఈ దొంగతనం నాటకం బయటపడింది.
ఆ చిన్నారి వెంటనే కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చి, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ మహిళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు, మత్తుమందు కలిపిన ఆహారం తిని అస్వస్థతకు గురైన ఏడుగురిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు. వీరిలో ముగ్గురు బాలికల పరిస్థితి విషమంగా ఉందని, నిందితురాలిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
