ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ‘ఒరాకిల్’ (Oracle) మరోసారి ఉద్యోగుల తొలగింపు (లేఆఫ్స్) ప్రక్రియను ప్రారంభించింది.
అయితే, ఈ విడతలో ఎంతమంది ఉద్యోగులను తొలగించారనే దానిపై స్పష్టమైన అధికారిక గణంకాలు ఇంకా వెల్లడి కాలేదు. సోమవారం (సెప్టెంబర్ 14) తెల్లవారుజామున 6 గంటలకే ప్రభావిత ఉద్యోగులకు తొలగింపు ఈ-మెయిళ్లు వచ్చాయి. చాలా మందికి ఈ మెయిల్ అందడానికి ముందే వారి సిస్టమ్ యాక్సెస్, ఒరాకిల్ లాగిన్ ఖాతాలను యాజమాన్యం బ్లాక్ చేసేసింది.
సంస్థలో చేపడుతున్న అంతర్గత పునర్వ్యవస్థీకరణ కారణంగా కొన్ని పోస్టులను రద్దు చేస్తున్నామని, ఈ-మెయిల్ వచ్చిన రోజే వారి చివరి పనిదినమని సదరు లేఖలో పేర్కొన్నారు. ఈ హఠాత్ పరిణామంతో దిగ్భ్రాంతికి గురైన ఉద్యోగులు ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లుతున్నారు. పలువురు బాధితులు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
రెడ్డిట్ (Reddit) వేదికగా ఓ యువ ఉద్యోగి తన బాధను వ్యక్తం చేస్తూ.. “ఉదయాన్నే లేచి చూడగానే నా లాప్టాప్ సిస్టమ్ లాక్ అయి ఉండటం చూసి షాక్ అయ్యాను. సరిగ్గా గంట తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్ వచ్చింది. నేనూ ఈ లేఆఫ్ల బారిన పడతానని కలలో కూడా ఊహించలేదు” అని వాపోయాడు. రెండేళ్లుగా జూనియర్ డెవలపర్గా పనిచేస్తున్న తనకు ఇంతవరకు ఒక్క ప్రమోషన్ కూడా రాలేదని, మేనేజర్ ఎప్పుడూ మంచి రేటింగ్ ఇవ్వకపోయినా కీలక ప్రాజెక్టులను మాత్రం తనకే అప్పగించేవారని గుర్తుచేసుకున్నాడు. ఇప్పటికే ఉద్యోగ మార్కెట్ గడ్డుకాలంలో ఉన్న తరుణంలో, వేలాది మందితో పోటీపడి మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుందన్న ఆందోళన అతన్ని వేధిస్తోంది.
మరో ఉద్యోగి కథ మరింత హృదయ విదారకంగా ఉంది. సరిగ్గా పెళ్లికి 11 రోజుల ముందు అతడు ఉద్యోగం కోల్పోయాడు. “నాలుగున్నరేళ్లు శ్రమించిన కంపెనీ నుంచి నా పెళ్లికి కొద్ది రోజుల ముందే నన్ను గెంటేశారు” అని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీ నిర్ణయాలు వ్యాపార దృక్కోణంలో ఉంటాయని, తన వ్యక్తిగత విషయాలు వారికి తెలియవని అర్థం చేసుకోగలనని చెబుతూనే.. ఈ సమయంలో ఇలా జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నాడు. అయితే, మానవాళికి ఉపయోగపడే మంచి పనిని ప్రారంభించేందుకు ఇదొక అవకాశంగా భావిస్తూ మనసును సరిదిద్దుకుంటున్నానని తెలిపాడు.
లేఆఫ్ భయంతో రోజంతా గడిపిన మరో ఉద్యోగి జీవితంలో ఎదురైన ఊహించని సంఘటన అందరినీ కదిలించింది. తన పేరు ఎక్కడ లేఆఫ్ జాబితాలో ఉంటుందోనని భయపడుతున్న సమయంలోనే.. అతని చిన్నారి పాపకు ఊపిరితిత్తుల సమస్య వచ్చి పరిస్థితి విషమించింది. ఆ క్లిష్ట క్షణంలో, తన చేతుల్లో ఉన్న పాప ప్రాణమే ముఖ్యమని, డబ్బు, ఉద్యోగం, ప్రమోషన్లు అన్నీ ప్రాణం తర్వాతేనని అతడు గ్రహించాడు.
ఇంకోవైపు, ఓ ఉద్యోగి భార్య లింక్డ్ఇన్లో తన భర్త పరిస్థితిని వివరిస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టింది. ఒరాకిల్ సంస్థలో 12 ఏళ్లుగా అంకితభావంతో పనిచేసిన తన భర్తకు కంపెనీ ఇచ్చిన బహుమతి ఉదయాన్నే ‘సిస్టమ్ లాక్’ అవ్వడమేనని ఆవేదన వ్యక్తం చేసింది. బయటి ప్రపంచానికి ఆయన పడిన శ్రమ, అనుభవించిన మానసిక ఒత్తిడి కనిపించవని, ముఖంపై నవ్వు చెదరనీయకుండా అందరికీ సాయపడే వ్యక్తని కన్నీటిపర్యంతమైంది.
బాధితుల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఈ ఉద్యోగుల అనుభవాలన్నీ ఒకే వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగం కోల్పోవడమంటే కేవలం నెలాఖరు జీతం కోల్పోవడమే కాదు.. అది ఆ వ్యక్తి భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చడంతో పాటు, కుటుంబ భద్రతను తీవ్ర ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఈ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.
