ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పెరోల్పై బయటకు వచ్చిన ఒక జీవిత ఖైదీ, తన భార్య తనకు విషం పెడుతుందేమోనని అనుమానించి ఇంట్లోని త్రిశూలంతో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహం వద్దే మూడు గంటల పాటు నిశ్చేష్టంగా కూర్చుండిపోయాడు. మహోబా జిల్లా రాగోలియా బుజుర్గ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 50 ఏళ్ల కల్లన్ రక్వార్ అనే వ్యక్తి, తన 48 ఏళ్ల భార్యను ఇంట్లో ఉన్న త్రిశూలంతో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు.
ఈ ఘోరానికి పాల్పడిన తర్వాత అతడు అక్కడి నుంచి పారిపోలేదు. తెల్లవారే వరకు అక్కడే ఉండి, ఉదయాన్నే స్వయంగా బంధువులకు సమాచారం అందించాడు. హత్య చేసిన తర్వాత మృతదేహం పక్కనే దాదాపు మూడు గంటల పాటు అతడు మౌనంగా కూర్చోవడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి ఆధారాలను సేకరించగా, నిందితుడు కల్లన్ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో నిందితుడు కల్లన్ రక్వార్ నేరచరిత్ర అత్యంత భయానకమైనదని తేలింది. అతడు ఇప్పటికే మధ్యప్రదేశ్లోని సత్నా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. గత 2014లో మధ్యప్రదేశ్లోని నౌగావ్లో తన సొంత 10 నెలల పసికందు అయిన మనవరాలిని బండరాయిపై విసిరి చంపిన కేసులో, 2017లో న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించింది. ఆ శిక్ష అనుభవిస్తూనే, ప్రతి మూడు నెలలకోసారి పెరోల్పై ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.
ఈ ఘటనపై మహోబా అదనపు ఎస్పీ వందనా సింగ్ మాట్లాడుతూ.. “తన భార్య పెట్టే భోజనంలో విషం లేదా మత్తుమందు కలుపుతోందన్న తీవ్రమైన అనుమానం, మానసిక భ్రాంతి కల్లన్కు ఉండేది. ఈ అనుమానం ముదరడంతోనే సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న త్రిశూలంతో భార్యను దాడి చేసి హతమార్చాడు” అని వెల్లడించారు.
ఉదయం కల్లన్ స్వయంగా బంధువులకు చెప్పడంతో పాటు పోలీసులకూ సమాచారం అందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు.
