ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ నెలవారీ వాయిదా (EMI) చెల్లించలేదని ఓ యువకుడిని కిడ్నాప్ చేసి, బ్లడ్ బ్యాంకుకు తీసుకెళ్లి బలవంతంగా రక్తం తీసిన కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణం స్థానికంగా తీవ్ర భయాందోళనలను, సంచలనాన్ని సృష్టించింది.
లక్నోలోని నిగోహా ప్రాంతానికి చెందిన నెవల్ అనే యువకుడు ఏడాది క్రితం రూ. 21,500 విలువైన శాంసంగ్ మొబైల్ ఫోన్ను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేశాడు. అయితే మొదటి నెల వాయిదా చెల్లించడంలో విఫలమవడంతో, దుకాణదారులు అప్పుడే అతని ఫోన్ను స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారు. కానీ ఏడాది గడిచిన తర్వాత, సెప్టెంబర్ 8న వచ్చిన ఇద్దరు వ్యక్తులు నెవల్ను బలవంతంగా స్కూటర్పై కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ చేసిన నెవల్ను లక్నోలోని ఒక బ్లడ్ బ్యాంకుకు తీసుకెళ్లి, అతని శరీరం నుంచి బలవంతంగా ఒక యూనిట్ రక్తాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని ఒక ఇంట్లో నిర్బంధించి, కొన్ని రోజుల పాటు కూలీ పనులు చేయించుకోవడమే కాకుండా.. అతని కుటుంబాన్ని ఫోన్లో బెదిరించి ఆన్లైన్ ద్వారా వాయిదా సొమ్మును కూడా వసూలు చేసుకున్నారు.
అంతేకాకుండా మరో రూ. 12,000 అదనంగా ఇవ్వకపోతే నెవల్ను చంపి గోమతి నదిలో పడేస్తామని ఆ దుండగులు బెదిరించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో, 5 రోజుల నిర్బంధం తర్వాత ఎట్టకేలకు దుండగులు అతడిని విడిచిపెట్టారు. విడుదలైన సమయంలో నెవల్ తీవ్ర అనారోగ్యం, భయంతో వణికిపోతూ కనిపించాడు.
