“ర్యాపిడో (Rapido) సంస్థకు గట్టి షాక్!” – టిప్స్ ఇవ్వడం తప్పనిసరి చేస్తూ బెదిరింపులు.. రెడ్ కలర్ హెచ్చరిక.. గ్రీన్ కలర్ తంత్రం.. యాప్ ద్వారా వినూత్న మోసం.. రూ.10 లక్షల జరిమానా విధిస్తూ యాక్షన్.!

ప్రముఖ బైక్ టాక్సీ మరియు ఆటో సేవల సంస్థ ‘ర్యాపిడో’ యాప్‌ను నిర్వహించే రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ (Roppen Transportation) సంస్థకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (CCPA) సంచలన నిర్ణయం తీసుకుంటూ రూ.10 లక్షల జరిమానా విధించింది.

ర్యాపిడో యాప్‌లో వినియోగదారులను మోసం చేసే విధంగా ఉపయోగించిన ‘డార్క్ ప్యాటర్న్’ (Dark Pattern) మరియు గందరగోళపరిచే టిప్పింగ్ అక్రమాలే ఈ కఠిన చర్యకు ప్రధాన కారణం.

విచారణ ప్రకారం, ర్యాపిడో యాప్‌లో రైడ్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులకు ప్రారంభంలో ఒక చార్జీ చూపించి, ఆ తర్వాత రైడ్ కన్ఫర్మ్ అయ్యే సమయంలో మరింత అదనపు డబ్బు చెల్లించాలని పరోక్షంగా మానసిక ఒత్తిడి తెచ్చారు. “అదనపు డబ్బులు చెల్లిస్తేనే రైడ్ దొరుకుతుంది; లేకపోతే డ్రైవర్లు రావడానికి నిరాకరిస్తారు” అని భయపెట్టే పదబంధాలను యాప్‌లో చేర్చారు. దీనిని ‘కన్ఫర్మ్ షేమింగ్’ (Confirm Shaming) గా CCPA ముద్ర వేసింది.

అంతేకాకుండా, ‘సెట్ యువర్ ప్రైస్’ (Set Your Price) ఫీచర్‌లో వినియోగదారులను గందరగోళపరిచేలా రంగులను ఉపయోగించారు. ధరను పెంచే ఆప్షన్‌ను ఆకుపచ్చ (గ్రీన్) రంగులో చూపిస్తూ, తగ్గించడానికి ప్రయత్నిస్తే ఎరుపు (రెడ్) లేదా ఆరెంజ్ రంగు హెచ్చరికలను ప్రదర్శిస్తూ మానసికంగా ధరను పెంచేలా నిర్బంధించారు. ఇది ‘ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్’ (Interface Interference) రకానికి చెందిన మోసమని గుర్తించారు.

సాధారణంగా, ‘టిప్స్’ (Tips) అనేది ప్రయాణం పూర్తయిన తర్వాత ప్రయాణికుడు తనకిష్టమై ఇచ్చే మొత్తము. కానీ దానిని రైడ్ లభించడానికి ఒక ముందస్తు షరతుగా మార్చడాన్ని CCPA తీవ్రంగా ఖండించింది. మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025 ప్రకారం కూడా ఇది నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. అదనపు రుసుము చెల్లిస్తేనే రైడ్ కన్ఫర్మ్ అవుతుందనడానికి ఎలాంటి సరైన ఆధారం సంస్థ వద్ద లేదని పేర్కొంటూ ర్యాపిడో వాదనను CCPA కొట్టివేసింది. ఇదిలా ఉండగా, ఉబెర్ (Uber), ఓలా (Ola), నమ్మ యాత్రి (Namma Yatri) వంటి ఇతర సంస్థలు కూడా ప్రస్తుతం CCPA తీవ్ర నిఘా మరియు విచారణ పరిధిలోకి రావడం గమనార్హం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *