“మగ సంతానం లేదు..! ఒకే ఒక్క కూతురని తొందరగా పెళ్లి చేసేశారు” – జాతీయ హాకీ క్రీడాకారిణి ఇప్పుడు ఆటో నడుపుతోంది.. పెళ్లి తర్వాత తలకిందులైన జీవితం..!!!

లక్నోకు చెందిన మాల్తికి ఒకప్పుడు హాకీ ఆడటమే తన జీవితానికి కేంద్రబిందువుగా ఉండేది.

తన 6వ ఏట నుండే చేతిలోకి హాకీ స్టిక్ పట్టిన ఆమె, వివిధ రాష్ట్రాలకు వెళ్లి పోటీల్లో పాల్గొనడమే కాకుండా, నాలుగు సార్లు జాతీయ స్థాయిలో తన రంగానికి ప్రాతినిధ్యం వహించారు. లక్నోలోని బాబూ బనారసీ దాస్ ఇంజనీరింగ్ కాలేజీలో స్పోర్ట్స్ ఆఫీసర్‌గా కూడా ఆమె పనిచేశారు.

అయితే, విఫలమైన పెళ్లి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు తన కొడుకును పెంచి పోషించాల్సిన బాధ్యత ఆ మాజీ క్రీడాకారిణిని వేరే మార్గాన్ని ఎంచుకునేలా చేశాయి. జీవితంలో ఎదురైన దారుణ పరిస్థితుల వల్ల పేదరికంలో చిక్కుకున్న ఆమె, వేరే దారి లేక 2013లో లక్నోలో ఎలక్ట్రిక్ ఆటో నడపడం ప్రారంభించారు. ఆ సమయంలో లక్నో నగరంలో ఈ పని చేసిన ఏకైక మహిళ మాల్తి మాత్రమే కావడం గమనార్హం. డిజిటల్ క్రియేటర్ సోనాలి సింగ్‌తో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడిన ఆమె తన గతాన్ని, పడ్డ కష్టాలను గుర్తుచేసుకున్నారు.

చిన్నతనం నుంచే హాకీపై తీవ్రమైన ఆసక్తి ఉన్న మాల్తి.. భువనేశ్వర్, ఆగ్రా, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి పలు ప్రాంతాలకు వెళ్లి ఆడిన రోజులను తన జీవితంలో ‘స్వర్ణ యుగం’గా అభివర్ణించారు. కె.డి. సింగ్ హాస్టల్‌లో ఉంటూ ఆడిన రోజుల్లో, తాను ఎన్ని గోల్స్ కొడతాననే దానిపైనే ప్రజలు బెట్టింగ్ కాసేవారని ఆమె గర్వంగా చెప్పారు. సెంటర్ ఫార్వర్డ్ ప్లేయర్‌గా మైదానంలో దిగి గోల్స్ వర్షం కురిపించిన ఆమె భవిష్యత్తు, తండ్రి తీవ్రమైన వ్యతిరేకతతో ప్రశ్నార్థకంగా మారింది. తనకు సోదరులు ఎవరూ లేకపోవడంతో, త్వరగా పెళ్లి చేసి పంపించడమే సరైనదని ఆమె తండ్రి గట్టిగా నమ్మారు.

పెళ్లి, కుటుంబ పరిస్థితులు, పేదరికం ఇలా అన్నిటినీ దాటుకుని వచ్చిన ఆమె, ప్రస్తుతం గత 15 ఏళ్లుగా ఆటో నడుపుతూ తన జీవితాన్ని సాగిస్తున్నారు. తన కలలన్నీ కళ్ల ముందే కరిగిపోయాయని ఇప్పటికీ ఆమె బాధపడుతున్నప్పటికీ, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె పోరాడుతున్న తీరు చాలామందిని భావోద్వేగానికి గురిచేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *