పుదుక్కొట్టై జిల్లా అరంతాంగి సమీపంలోని కొల్లన్ వయల్ గ్రామానికి చెందిన తంగరాసు కుమారుడు మురుగన్ (27).
అతనికి, వై వైద్యనాథన్ వయల్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక యమునకు మధ్య గత 3 ఏళ్లుగా ప్రేమాయణం సాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రేమికురాలిని కలవడానికి మురుగన్ ఆమె ఇంటికి వెళ్లాడు. కొంతసేపటికే ఆ ఇంట్లోనే మురుగన్ మర్మమైన రీతిలో శవమై పడి ఉన్నాడు. మురుగన్ శవమై పడి ఉండటం చూసిన బాలిక యమునా, ఏమాత్రం కంగారు పడకుండా అతడి మృతదేహాన్ని తన సెల్ఫోన్లో ఫోటో తీసి, మురుగన్ బంధువులకు వాట్సాప్ ద్వారా పంపింది.
మృతదేహం ఫోటోను చూసి షాక్కు గురైన మురుగన్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆ బాలిక ఇంటిని ముట్టడించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న అరంతాంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మురుగన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ యువకుడిని కొట్టి చంపారా లేదా విషమిచ్చి చంపారా అనే కోణంలో ప్రేమికురాలు యమునా, ఆమె తల్లి పెరియనాయగి మరియు మేనమామ సెల్వం ముగ్గురిని పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించి తీవ్రంగా విచారిస్తున్నారు.

Leave a Reply