“అధికారి టేబుల్‌పై కుక్కపిల్లలను వదిలేసిన ప్రజలు” – వీధి కుక్కల బాధ భరించలేక నాసిక్‌లో వినూత్న నిరసన..!!

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర పంచాయతీ కార్యాలయంలో, వీధి కుక్కల బెడదపై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారికి నిరసనగా ప్రజలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టిన ఘటన కలకలం రేపింది.

ఆ ప్రాంతంలో వీధి కుక్కల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు మరియు వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతూ కుక్కకాటుకు గురవుతున్నారు.

ఈ సమస్యపై మున్సిపల్ యంత్రాంగానికి పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన ఆందోళనకారులు, రెండు చిన్న వీధి కుక్కపిల్లలను గోనెసంచిలో దాచి రహస్యంగా పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భామరే చాంబర్‌లోకి వెళ్లి, ఆయన ఆఫీస్ టేబుల్‌పైనే ఆ కుక్కపిల్లలను వదిలేయడమే కాకుండా.. అధికారిని ఎగతాళి చేస్తూ ఆయన టేబుల్‌పై నోట్ల దండను కూడా ఉంచి వెళ్లారు.

ప్రస్తుతం వినాయక చవితి వేడుకలు జరుగుతున్న తరుణంలో, వీధుల్లో తిరిగే కుక్కల వల్ల గణేష్ పండల్స్ (మండపాల)కు వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కుక్కలకు వెంటనే సంతాననిరోధక (ABC) శస్త్రచికిత్సలు నిర్వహించాలని, అధికారులు కేవలం టెండర్ ప్రక్రియలపైనే దృష్టి పెట్టకుండా ప్రజల సమస్యలను తీర్చాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మరిన్ని కుక్కలను ఆఫీస్‌లోకి తీసుకొచ్చి వదులుతామని హెచ్చరించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *