సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
బీహార్లో రోడ్డుపక్కన బేల్పూరి, మసాలా వంటి చిరుతిళ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న ఓ పేద వ్యాపారిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. అంతేకాదు.. ఆ వ్యాపారి వద్ద ఉన్న ఆహార పదార్థాలను రోడ్డుపైకి విసిరేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వ్యక్తి అకస్మాత్తుగా వ్యాపారి వద్దకు వచ్చి అతనిపై దాడి చేస్తాడు. అనంతరం అతని వద్ద ఉన్న పూరీ, ఇతర ఆహార పదార్థాలను రోడ్డుపై పడేస్తాడు.
ఏం చేయాలో తెలియక ఆ పేద వ్యాపారి దీనంగా నిలబడి ఉండటం.. చుట్టుపక్కల ఉన్న కొందరు ఈ ఘటనను చూస్తూ ఉండిపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోను ‘కుర్ఫాన్ ఆలం’ అనే ఎక్స్ (X) వినియోగదారు షేర్ చేసి, బీహార్ పోలీసులను ట్యాగ్ చేశారు. బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు.
ఈ ఘటనపై పలువురు నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందించారు. “ఇది చాలా సిగ్గుచేటైన చర్య. ఆ పేద వ్యాపారికి జరిగిన నష్టాన్ని దాడి చేసిన వ్యక్తే పూర్తిగా భర్తీ చేయాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే.. ఈ వీడియో నిజమైన ఘటనకు సంబంధించినదా? లేక ముందుగా చిత్రీకరించినదా? అనే విషయం మాత్రం ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు.
వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో బీహార్, పాట్నా పోలీసులు కూడా స్పందించారు.
బీహార్ పోలీసులు.. పాట్నా పోలీసులను ట్యాగ్ చేస్తూ, ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పాట్నా పోలీసులు కూడా ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు పంపించి, తదుపరి చర్యలు తీసుకునేలా చేసినట్లు తెలిపారు.
అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.

Leave a Reply