మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్‌లో బ్యాంకుకు కేవలం 100 మీటర్ల దూరంలో ఒక వ్యాపారి నుంచి రూ. 40 లక్షలు దోపిడీకి గురైన ఉదంతం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
కల్యాణ్ వెస్ట్ ప్రాంతంలోని ఆగ్రా రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం దాదాపు 1:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడానికి ఒక వ్యాపారి తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, వారిని అనుసరిస్తూ వచ్చిన అపరిచిత వ్యక్తులు దారి కాచి అడ్డుకున్నారు. పట్టపగలు బ్యాంకుకు అతి సమీపంలోనే ఈ దోపిడీ జరగడం తీవ్ర కలకలం రేపింది.
వాల్ధుని ప్రాంతానికి చెందిన పొగాకు, పాన్ మసాలా వ్యాపారి ఫారూఖ్ అక్తర్, తన స్నేహితుడితో కలిసి ఆగ్రా రోడ్డులోని బ్యాంకులో రూ. 40 లక్షలు డిపాజిట్ చేసేందుకు బైక్‌పై వెళ్లాడు. షూ మాల్ సమీపానికి చేరుకోగానే, వెనుక నుండి బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వ్యాపారి వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టారు. దీంతో వారిద్దరూ రోడ్డుపై పడిపోగా, దొంగలు వారి వద్ద ఉన్న డబ్బుల సంచిని లాక్కునేందుకు యత్నించారు. వారు నిరోధించేందుకు ప్రయత్నించగా, దాడి చేసి చంపేస్తామని బెదిరించి రూ. 40 లక్షల నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ దోపిడీ ఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. వ్యాపారి కదలికలను దొంగలు ముందుగానే గమనించి ఉండవచ్చని, అతని వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉందనే సమాచారం వారికి ముందే తెలిసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వ్యాపారి వద్ద అంత డబ్బు ఉందనే విషయం దొంగలకు ఎలా తెలిసిందనే దానితో సహా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన గురించి సమాచారం అందగానే పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో నమోదైన సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకుని, అందులో రికార్డయిన దొంగల రూపాలను, వారు పారిపోయిన మార్గాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగలను పట్టుకోవడానికి 2 ప్రత్యేక బృందాలను (స్పెషల్ టీమ్స్) ఏర్పాటు చేసి, ప్రధాన రహదారుల్లో వాహనాల తనిఖీలను తీవ్రతరం చేశారు. జనాభా రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపై పట్టపగలే బ్యాంకుకు సమీపంలో రూ. 40 లక్షలు దోపిడీకి గురైన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

Leave a Reply