ఢిల్లీకి సమీపంలో ఉన్న ఘాజియాబాద్ ప్రాంతంలో ప్రజల ఆరోగ్యంతో, డబ్బుతో ఆడుకుంటున్న ఒక పెద్ద కల్తీ ముఠా కుట్ర ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మరియు పోలీసులు కలిసి నిర్వహించిన ఆకస్మిక దాడిలో, చవకైన చిన్న మిరియాలను మైదా, జిగురు మరియు రిఫైండ్ ఆయిల్ ఉపయోగించి అత్యంత ఖరీదైన ‘ఎ-గ్రేడ్’ మిరియాలుగా మారుస్తున్న ఒక తయారీ కేంద్రం బయటపడింది.
ఘాజియాబాద్‌లోని లోని సరిహద్దు పరిధిలోని సేవాధామ్ ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో రహస్యంగా ఈ మిరియాల కల్తీ కర్మాగారం నడుస్తోంది. సెప్టెంబర్ 17 రాత్రి వచ్చిన పక్కా సమాచారం ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు కలిసి సడన్‌గా దాడి చేశారు.
అక్కడ ఢిల్లీలోని బుద్ధ విహార్ ప్రాంతానికి చెందిన లోకేష్ గుప్తా అనే వ్యక్తి, నాణ్యత లేని చిన్న మిరియాలను పెద్ద సైజు ‘ఎ-గ్రేడ్’ మిరియాలుగా మారుస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో లోకేష్ గుప్తా ఈ మోసానికి ఎలా పాల్పడ్డాడో వివరిస్తూ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించాడు. మార్కెట్లో అత్యంత చవకగా దొరికే నాణ్యత లేని చిన్న సైజు మిరియాలను ముందుగా కొనుగోలు చేస్తాడు. మిరియాల పరిమాణాన్ని, బరువును పెంచడం కోసం మైదా పిండి, జిగురు పొడిని కలిపి ఒక చిక్కటి పేస్ట్ తయారు చేస్తాడు.
ఆ పేస్ట్‌లో చిన్న మిరియాలను నానబెట్టి తీసి, ఆ తర్వాత ఇంటి డాబాపై ఆరబెడతాడు. ఎండిన మిరియాలను గోనె సంచుల్లో వేసి రుద్ది ఫైన్ ఫినిషింగ్ ఇస్తాడు. చివరగా, అవి మెరుస్తూ పెద్ద మిరియాల్లా కనిపించడం కోసం సోయాబీన్ రిఫైండ్ ఆయిల్‌తో పాలిష్ చేసి ‘ఎ-గ్రేడ్’ మిరియాలుగా మారుస్తాడు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఆ ఫ్యాక్టరీ నుండి సుమారు రూ. 13.5 లక్షల విలువైన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 60 బస్తాల మైదా, 18 బస్తాల జిగురు పొడి, 40 బస్తాల (సుమారు 1200 కేజీలు) నాణ్యత లేని చిన్న మిరియాలు, 65 బస్తాల (సుమారు 975 కేజీలు) తయారు చేసిన కల్తీ మిరియాలు, 37 టిన్నుల సోయాబీన్ రిఫైండ్ ఆయిల్ ఉన్నాయి.
స్వాధీనం చేసుకున్న పదార్థాల నుండి 5 శాంపిళ్లను సేకరించి, వేగంగా నివేదిక రావడం కోసం ల్యాబ్‌కు పంపారు. ఈ ప్రమాదకరమైన కల్తీ మిరియాలను ఏ ఏ మార్కెట్లకు, షాపులకు సరఫరా చేశారు? ఈ వ్యవహారంలో లోకేష్‌తో పాటు ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అనే కోణంలో అధికారులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply