నాగుపామే.. కానీ సాధారణ నాగుపాము కాదు! హిమాచల్‌లో ఇద్దరి ప్రాణాలు తీసిన కాస్పియన్ నాగుపాము.. భారత యాంటీవెనమ్ ఎందుకు పూర్తిగా పనిచేయకపోవచ్చు?

హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో కాస్పియన్ నాగుపాము (Caspian cobra) కాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటనలకు సంబంధించిన తొలి శాస్త్రీయ నివేదిక వెలువడింది.

2020, 2021 సంవత్సరాల్లో జరిగిన ఈ రెండు ఘటనలు.. భారతదేశంలో కాస్పియన్ నాగుపాము కాటు కారణంగా నమోదైన తొలి మరణాలుగా ఈ అధ్యయనం పేర్కొంది.

అధ్యయనంలో నమోదైన మొదటి ఘటన 2020 జూలైలో జరిగింది. ఓ యాపిల్ తోటలో పనిచేస్తున్న 40 ఏళ్ల వ్యక్తిని కాస్పియన్ నాగుపాము రెండుసార్లు కాటేసినట్లు నివేదిక తెలిపింది. తీవ్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

మరో ఘటన 2021 జూలైలో జరిగింది. 62 ఏళ్ల వ్యక్తి అనుకోకుండా పామును తొక్కడంతో కాటుకు గురయ్యాడు. కాటు వేసిన సుమారు అరగంటలోనే అతడు స్పృహ కోల్పోయినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.

ఈ ఘటనల్లో అత్యంత ముఖ్యమైన అంశం పాము విషానికి ఉపయోగించే యాంటీవెనమ్‌పై ఉన్న సందేహాలు.

భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే పాలీవాలెంట్ యాంటీవెనమ్‌ను దేశంలోని ప్రధాన విషపూరిత పాముల విషాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. వీటిలో సాధారణ నాగుపాము, కామన్ క్రైట్, రస్సెల్స్ వైపర్, సా-స్కేల్డ్ వైపర్ వంటి పాములు ఉన్నాయి.

అయితే కాస్పియన్ నాగుపాము విషంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండటంతో, సాధారణంగా అందుబాటులో ఉన్న యాంటీవెనమ్ దాని విషాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయకపోవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కాస్పియన్ నాగుపామును మధ్య ఆసియా నాగుపాము అని కూడా పిలుస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా ప్రాంతంలో ఈ జాతి నాగుపాము ఉనికిని జన్యు అధ్యయనాల ద్వారా నిర్ధారించినట్లు నివేదిక పేర్కొంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *