పెళ్లయిన కొన్ని రోజులకే భార్య, “నేను వేరే ఒకరిని ప్రేమిస్తున్నాను; నిన్ను నా భర్తగా అంగీకరించలేను” అని చెప్పినట్లు ఒక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌లోని వైశాలి ప్రాంతానికి చెందిన అభినవ్ అనే వ్యక్తి, తన భార్య మరియు ఆమె కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేశాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసుల దృష్టికి వెళ్లింది.
అభినవ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, గత మే నెలలో ఇద్దరు మధ్యవర్తుల ద్వారా పానిపట్‌కు చెందిన రాణితో అతనికి వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాల సమ్మతితో మే 14న నిశ్చితార్థం జరగ్గా, జూలై 11న వివాహం జరిగినట్లు సమాచారం. పెళ్లి వేడుక కోసం ఇరు కుటుంబాలు కలిసి దాదాపు రూ.4 లక్షలు ఖర్చు చేశాయని కూడా అతడు తెలిపాడు.
పెళ్లయిన కొన్ని రోజులకే భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని అభినవ్ చెప్పాడు. జూలై 25న ఇంట్లో జరిగిన ఒక వేడుక సమయంలో, తనను భర్తగా అంగీకరించనని, వేరే ఒక యువకుడిని ప్రేమిస్తున్నానని భార్య చెప్పినట్లు అతడు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా, భార్య కుటుంబ సభ్యులు రూ.2 లక్షల నగదుతో పాటు ఆస్తి పత్రాలను ఆమె పేరిట మార్చి ఇవ్వాలని డిమాండ్ చేశారని అభినవ్ ఆరోపించాడు.
ఈ వ్యవహారం పోలీసుల దగ్గరకు వెళ్లడంతో మహిళా పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది. అభినవ్ ఆరోపించిన ప్రేమ వ్యవహారం, నగదు మరియు ఆస్తి పత్రాల డిమాండ్లకు సంబంధించిన ఆరోపణలన్నీ విచారణ తర్వాతే పూర్తిగా నిర్ధారణ అవుతాయని పోలీసులు తెలిపారు.

Leave a Reply