కృత్రిమ మేధ (AI) సాంకేతికత మానవ నియంత్రణను అధిగమించి, సొంతంగా ఆలోచిస్తూ మోసపూరిత చర్యలకు పాల్పడటం ప్రారంభించిందని OpenAI సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
AI మోడళ్లలో కనిపిస్తున్న ఈ ప్రమాదకరమైన మార్పులను తీవ్రంగా పర్యవేక్షించనున్నట్లు ప్రకటించింది. AI అభివృద్ధిని నియంత్రించాలంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పరిశోధకులు డిమాండ్ చేస్తున్న తరుణంలో, OpenAI విడుదల చేసిన ఈ నివేదిక అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.
ఇటీవల నిర్వహించిన పరిశోధనా పరీక్షల్లో, AI మోడళ్లు మానవులకు తెలియకుండా సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఉదాహరణకు, ఇంకా విడుదల చేయని ఒక AI మోడల్, దానిపై విధించిన ఆంక్షలను దానికదే తొలగించుకుని పనిచేయడం ప్రారంభించింది. మరొక AI మోడల్, వినియోగదారుడి అనుమతి లేకుండా ఒక ముఖ్యమైన ఫైల్‌ను పబ్లిక్ ఇంటర్నెట్లో అప్లోడ్ చేసింది. అంతేకాకుండా కొన్ని AI మోడళ్లు తమ తప్పులను దాచడం, అసత్య సమాచారాన్ని సృష్టించడం కూడా నేర్చుకున్నాయి.
AI వ్యవస్థలు మానవులను మోసం చేసే రీతిలో వ్యవహరించడం భవిష్యత్తులో తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవులు తమను మూల్యాంకనం (Evaluate) చేయబోతున్నారని గ్రహిస్తున్న AI టూల్స్, మంచి స్కోర్ సాధించడం కోసం కుంటిసాకులు, మోసపూరిత మార్గాలను ఉపయోగిస్తున్నాయని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాట్ ఫెడరిక్సన్ వివరించారు.
కొన్ని నెలల క్రితం కూడా OpenAI, Anthropic సంస్థలకు చెందిన అనియంత్రిత AI వ్యవస్థలు ఇతర సంస్థలను హ్యాక్ చేయడానికి ప్రయత్నించిన దిగ్భ్రాంతికర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సాంప్రదాయ భద్రతా పద్ధతులను ఉపయోగించి రాబోయే అత్యంత ప్రతిభావంతమైన AI టూల్స్‌ను నియంత్రించడం చాలా కష్టమని సాంకేతిక పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రమాదాలను అరికట్టడానికి, AI అనుమానాస్పద కార్యకలాపాలను ప్రపంచానికి బహిర్గతం చేయడానికి ఒక కొత్త పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు OpenAI తెలిపింది. AI సాంకేతికత మానవాళికి ముప్పుగా మారకుండా ఉండేందుకు, అన్ని సాంకేతిక సంస్థలు కలిసికట్టుగా సురక్షితమైన మార్గదర్శకాలను రూపొందించాలని పిలుపునిచ్చింది.

Leave a Reply