మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఒక పారిశ్రామికవేత్త, తన భార్యకు తెలియకుండా ప్రియురాలితో కలిసి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు టూర్ వెళ్దామని వేసిన ప్లాన్, ముంబై విమానాశ్రయంలో చేసిన ఒకే ఒక్క తప్పుతో బట్టబయలై భార్య ముందే పరువు పోగొట్టుకున్న ఉదంతం తీవ్ర కలకలాన్ని, నవ్వులను పూయిస్తోంది.
బిజినెస్ పని మీద బయటకు వెళ్తున్నానని భార్యకు అబద్ధం చెప్పి, ప్రియురాలితో కలిసి సరదాగా విదేశాలకు ఎగిరిపోదామని ప్లాన్ చేసిన ఆ పారిశ్రామికవేత్తకు ఊహించని షాక్ ఎదురైంది. తన పాస్‌పోర్ట్ నుండి భార్యకు తెలియకుండా కొన్ని పేజీలను చింపి పడేయడమే ఆ బిజినెస్మెన్ చేసిన చారిత్రాత్మక పొరపాటు!
గతంలో ప్రియురాలితో కలిసి వెళ్లిన విదేశీ ప్రయాణాల వీసా స్టాంపులు పాస్‌పోర్ట్‌లో ఉండటంతో, అది భార్య చూస్తే నిజం తెలిసిపోతుందనే భయంతో పాస్‌పోర్ట్‌లోని కొన్ని పేజీలను అతడే సొంత చేతులతో చింపివేశాడు.
పాస్‌పోర్ట్‌ను పాడుచేయడం (ట్యాంపరింగ్) తీవ్రమైన నేరమని తెలియక, భార్య నుంచి తప్పించుకోవాలనుకున్న ఆ పారిశ్రామికవేత్త, కౌలాలంపూర్ వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులకు నిలువునా దొరికిపోయాడు.
పేజీలు చింపేసిన పాస్‌పోర్ట్‌ను చూసిన అధికారులు, అతడిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారించడమే కాకుండా, ఈ విషయాన్ని అతని కుటుంబానికి కూడా తెలియజేశారు. కంగారుపడుతూ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు పరుగెత్తుకొచ్చిన భార్య కళ్ల ముందే.. భర్త ప్రియురాలితో కలిసి విదేశాలకు వెళ్లడానికి వేసిన సీక్రెట్ ప్లాన్‌ను, పాస్‌పోర్ట్ చింపేసిన షాకింగ్ నిజాన్ని అధికారులు బట్టబయలు చేశారు.
భార్య చేతికి చిక్కి పరువు పోగొట్టుకోవడమే కాకుండా, పాస్‌పోర్ట్‌ను ధ్వంసం చేసిన నేరానికి గాను పోలీసులు ఆ పారిశ్రామికవేత్తను అరెస్టు చేసిన ఈ ఘటన, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫన్నీ చర్చకు దారితీసింది.

Leave a Reply