ఢిల్లీలో రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో స్వయంగా తెలుసుకోవాలని ఓ యువకుడు నిర్ణయించుకున్నాడు.
అందుకోసం మహిళలు ధరించే దుస్తులు, మేకప్ వేసుకుని.. ముఖాన్ని దుపట్టాతో కప్పుకుని అర్ధరాత్రి స్కూటీపై బయటకు వెళ్లాడు. ఢిల్లీ వీధుల్లో సుమారు రెండు గంటల పాటు చేసిన ఈ ప్రయాణాన్ని వీడియోగా చిత్రీకరించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
ఈ రెండు గంటల ప్రయాణంలో తనకు అనేక ఆందోళనకరమైన అనుభవాలు ఎదురయ్యాయని ఆ యువకుడు తెలిపాడు.
ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచే రోడ్డుపై ఉన్న కొందరు పురుషులు, పెట్రోల్ బంక్లో ఉన్న వ్యక్తులు తనను పదేపదే తదేకంగా చూశారని చెప్పాడు. అంతేకాకుండా కొందరు తనను వెంబడించేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు.
మరికొందరు ఆటో డ్రైవర్లు తన స్కూటీకి అడ్డంగా వాహనాలను నడిపి ఇబ్బంది పెట్టారని తెలిపాడు. కారు, బైక్, ఆటో వంటి వివిధ వాహనాల్లో వచ్చిన కొందరు తనను వెంబడించేందుకు ప్రయత్నించడంతో భయాందోళనకు గురైనట్లు చెప్పాడు.
దీంతో తాను చేపట్టిన ఈ ప్రయోగాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చిందని వివరించాడు.
ఈ అనుభవం తర్వాత ఆ యువకుడు మాట్లాడుతూ.. “రాత్రివేళ మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లడం ఎంత అసురక్షితంగా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. మహిళల రోజువారీ జీవితం చాలా కష్టంగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
అతను షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 1.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఢిల్లీలో మహిళల భద్రతపై సోషల్ మీడియాలో మరోసారి విస్తృత చర్చ జరుగుతోంది.

Leave a Reply