ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు వచ్చిన ఓ విదేశీ మహిళకు అక్కడ కొందరి వల్ల ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీసింది.
తాజ్‌మహల్ అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకుంటున్న ఆ మహిళను ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో స్థానిక పురుషులు చుట్టుముట్టారు. ఆమెను తదేకంగా చూస్తూ, తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఇబ్బంది పెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది.
చుట్టూ జనం సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. ఆ మహిళ తీవ్ర అసౌకర్యానికి, ఆందోళనకు గురైనట్లు ఆమె ముఖ కవళికలను బట్టి తెలుస్తోంది.
పరిస్థితి చేయి దాటిపోతున్నట్లు గమనించిన అక్కడ పనిచేస్తున్న ఓ ఫొటోగ్రాఫర్ వెంటనే జోక్యం చేసుకున్నారు. మహిళను చుట్టుముట్టి వీడియోలు తీస్తున్న వారిని మందలించి, అక్కడి నుంచి వెనక్కి వెళ్లాలని సూచించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేవలం ఘటనను వీడియోగా చిత్రీకరించకుండా.. వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దిన ఆ ఫొటోగ్రాఫర్‌ను పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. “మన దేశ అతిథి మర్యాద, పౌర బాధ్యత ఇదేనా?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు ‘అతిథి దేవో భవ’ అని చెబుతూ.. మరోవైపు విదేశీ పర్యాటకులను వింతగా చూస్తూ, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ పర్యాటకులకు భద్రతతో పాటు గౌరవప్రదమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు సూచిస్తున్నారు.

Leave a Reply