ముంబై కోస్టల్ రోడ్డులో తెల్లవారుజామున అతివేగంగా వెళ్లిన బిఎమ్‌డబ్ల్యూ (BMW) కారు ప్రమాదానికి గురికావడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర ప్రమాదం లోటస్ జెట్టీ సమీపంలో ఉదయం సుమారు 5:20 గంటల ప్రాంతంలో జరిగింది.
మెరైన్ డ్రైవ్ ప్రాంతం నుంచి బిఎమ్‌డబ్ల్యూ కారు వెళ్తున్న సమయంలో, తీవ్ర వేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. అదుపు తప్పిన కారు వంతెన రక్షణ గోడను (పారపేట్ వాల్) బలంగా ఢీకొని, అక్కడి నుంచి కిందపడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురినీ నాయర్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించగా ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుల్లో 21 ఏళ్ల షనాయ్ గజ్జల్, 17 ఏళ్ల దైర్య సేథ్ ఉన్నట్లు గుర్తించారు. మరణించిన మరొక యువకుడి వయస్సు 25 సంవత్సరాలుగా వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన 20 ఏళ్ల మరో యువకుడు ట్రౌమా వార్డులో చికిత్స పొందుతున్నాడు.
ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో బిఎమ్‌డబ్ల్యూ కారు అదుపు తప్పి వంతెన అంచుని దాటుకుంటూ కిందపడిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply