పాకిస్థాన్‌కు చెందిన వివాదాస్పద రాజకీయ విశ్లేషకుడు, ‘రెడ్ క్యాప్’ జైద్ హమీద్ (Zaid Hamid) అని పిలువబడే వ్యక్తి తాజాగా విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న ‘మక్కా ఒప్పందం’ ఆధారంగా, యెమెన్ దేశంలోని హూతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో పాకిస్థాన్ సైన్యం రంగంలోకి దిగొచ్చనే చర్చ జరుగుతున్న తరుణంలో, జైద్ హమీద్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ మేరకు ఆయన విడుదల చేసిన వైరల్ వీడియోలో, ‘సౌదీ అరేబియా ప్రయోజనాల కోసం యెమెన్‌కు వెళ్లి ముస్లింల రక్తపుటేరులు పారించడం మూర్ఖత్వం. ఇది చివరికి పాకిస్థాన్ సర్వనాశనానికే దారితీస్తుంది. కాబట్టి, పాకిస్థాన్ సైన్యం ఏ పరిస్థితుల్లోనూ సౌదీ ప్రోద్బలంతో యెమెన్ యుద్ధంలో అడుగుపెట్టకూడదు’ అని పేర్కొన్నారు.
సౌదీ అరేబియాను అత్యంత తీవ్రంగా విమర్శించిన జైద్ హమీద్, ‘సౌదీని ముస్లింల నాయకుడిగా భావించకండి; అది ఒక మోసపూరిత దేశం. ముస్లింలను అంతం చేయడమే వారి ప్రధాన లక్ష్యం’ అంటూ ఆవేశంగా తెలిపారు. అంతేకాకుండా, యెమెన్‌లో సౌదీ సాగిస్తున్న యుద్ధం ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఏర్పాటు కోసం జరుగుతున్న ఒక రహస్య ప్రణాళికలో భాగమని, యెమెన్ అనేది పాకిస్థాన్ సైన్యాన్ని దెబ్బతీసే ఒక ‘ఉచ్చు’ అని ఆయన హెచ్చరించారు.
ఒకానొక సమయంలో పాకిస్థాన్ సైన్యం యెమెన్‌కు వెళ్లడాన్ని తాను వ్యతిరేకించినప్పుడు, సౌదీ అరేబియాలో తాను అరెస్టై జైలుపాలయ్యానని ఆయన ఆ వీడియోలో గుర్తు చేసుకున్నారు.
మరోవైపు, పాకిస్థాన్ సైనిక ప్రధానాధికారి (ఆర్మీ చీఫ్) ఆసిమ్ మునీర్‌ను ప్రశంసించిన జైద్ హమీద్, ఆయన ధైర్యశాలి మరియు దూరచూపు గల నాయకుడని అభివర్ణించారు. సౌదీ నుంచి డబ్బులు తీసుకోవడం లేదా ఒప్పందాలు చేసుకోవడం వరకే అది పరిమితం కావాలని, ఆసిమ్ మునిర్ సౌదీ ఉచ్చులో పడరని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలపై బాంబుల వర్షం కురిపించడానికి తన సైన్యాన్ని ఆసిమ్ మునిర్ యెమెన్‌కు పంపరని తాను గట్టిగా నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply