ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్‌పూర్ ప్రాంతంలో అంత్యక్రియల సమయంలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదాన్ని, కలకలాన్ని రేపుతోంది.
షాజహాన్‌పూర్ జిల్లా నద్యాపూర్ గ్రామానికి చెందిన 60 ఏళ్ల ఛోటీలాల్.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. ఆ తర్వాత, ఆదివారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.
లాంఛనాలన్నీ ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో, దహనం చేసిన చితిని మళ్లీ చూసేందుకు ఛోటీలాల్ కుమారుడు వీర్పాల్ ఒక్కడే శ్మశానానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన అతనికి పెద్ద షాక్ ఎదురైంది.
వీర్పాల్ అక్కడికి వెళ్లేసరికి.. కాలుతున్న చితి మంటలను ఉపయోగించి ముగ్గురు వ్యక్తులు ఓ పాత్రలో మాంసం వండుతుండటం చూసి అతడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే చుట్టుపక్కల ఉన్న తన బంధువుల సహాయంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ యువకుడు స్థానికులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా, మిగతా ఇద్దరు తాము వచ్చిన మోటార్ సైకిల్‌పై అక్కడి నుంచి పరారయ్యారు.
దీనిపై వెంటనే ‘112’ అత్యవసర సహాయ నంబర్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు పట్టుకున్న యువకుడిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
మరణించిన తన తండ్రి కాలుతున్న చితిపై మాంసం వండి అవమానించిన ఆ వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని ఛోటీలాల్ కుమారుడు వీర్పాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై పోలీస్ అధికారి ప్రవీణ్ మాలిక్ మాట్లాడుతూ.. “దీనిపై మాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్నాం. విచారణ తర్వాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర కలకలాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది.

Leave a Reply