గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో పెళ్లైన 21 ఏళ్ల తర్వాత, ఓ మహిళ తన భర్తపై వరకట్న వేధింపులు, దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
థల్తేజ్ ప్రాంతంలో నివసిస్తున్న 40 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె భర్త, పాఠశాల ప్రిన్సిపాల్ అయిన హర్షద్‌పై బోడక్‌దేవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివాహమైన కొద్ది నెలలకే తమ మధ్య గొడవలు మొదలయ్యాయని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
గత ఆగస్టు 23న ఇంటి ఖర్చుల విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో భర్త తనను దూషించి, దాడి చేశాడని, పుట్టింటి నుంచి ఏమీ తీసుకురాలేదని, ఇంటి ఖర్చులన్నీ తానే భరించాల్సి వస్తోందని నానా మాటలు అన్నాడని మహిళ ఆరోపించింది. ఈ దాడిలో గాయపడిన ఆమె, మరుసటి రోజు ఆగస్టు 24న సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. అనంతరం పుట్టింటికి వెళ్లిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2005లో వివాహం జరిగినప్పటి నుంచి పలు విషయాల్లో తమ మధ్య విభేదాలు ఉండేవని ఆ మహిళ తెలిపింది. భోజనం, ఇంటి పని, పిల్లల చదువు, కుటుంబ ఖర్చుల వంటి విషయాలపై తరచుగా గొడవలు జరిగేవని, భర్త తనను తిడుతూ కొట్టేవాడని ఆమె పేర్కొంది. అంతేకాకుండా, ఇల్లు కొనుగోలు చేయడానికి తన తండ్రి నుంచి డబ్బు తీసుకురావాలని భర్త అడిగాడని, తన తండ్రి డబ్బు ఇచ్చాడని కూడా ఫిర్యాదులో తెలిపింది. ఆ తర్వాత ఆ డబ్బును తిరిగి అడిగినప్పుడు, “కట్నంగా ఏమీ ఇవ్వలేదు కదా” అని భర్త సమాధానం ఇచ్చాడని ఆమె ఆరోపించింది.
అహ్మదాబాద్‌కు మకాం మార్చిన తర్వాత కూడా పిల్లల చదువు, ఇంటి పనులు, ఖర్చుల విషయంలో గొడవలు కొనసాగాయని మహిళ తెలిపింది. 2023లో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భర్త తనపై దాడి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఆగస్టు 23న జరిగిన దాడి ఘటనతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు భారతీయ న్యాయ చట్టంలోని పలు సెక్షన్లతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply