ఇటలీలోని పాఠశాల తరగతి గదుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యను నియంత్రించడంతో పాటు, బడుల్లో బురఖా, నిఖాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ త్వరలో కొత్త చర్యలను తీసుకురానున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తెలిపారు.
తన ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీకి చెందిన యువజన విభాగం కార్యక్రమంలో ఆమె ఈ ప్రకటన చేశారు.
ఈ కొత్త చట్టం ప్రకారం, పాఠశాల వాతావరణంలో ఇమడటానికి ఇబ్బంది పడే విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇటాలియన్ భాషా పాఠాలు నేర్చుకోవడం తప్పనిసరి చేయబడుతుంది. ఇటలీకి వచ్చి జీవించాలనుకునే వారు ఈ దేశ భాషను నేర్చుకోవాలని, ఇక్కడి సంస్కృతిని అర్థం చేసుకోవాలని, నిబంధనలను గౌరవించాలని మెలోనీ ఉద్ఘాటించారు.
శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే ‘బురఖా’, ముఖాన్ని కప్పి ఉంచే ‘నిఖాబ్’ వంటి దుస్తులకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని, కేవలం తలను మాత్రమే కప్పి ఉంచే ‘హిజాబ్’ గురించి ఆమె ఎలాంటి ప్రస్తావన చేయలేదని సమాచారం. ఈ ముసాయిదా ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత, చట్టంగా మారాలంటే 60 రోజుల్లోగా ఇటలీ పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది.
తీవ్ర మితవాద (రైట్-వింగ్) రాజకీయ నేపథ్యం ఉన్న మెలోనీ, వలసల వ్యవహారాల్లో మొదటి నుంచి కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. అయినప్పటికీ, ప్రధాని అయిన తర్వాత యూరోపియన్ యూనియన్ రాజకీయ నాయకులలో విశేష గుర్తింపు పొందిన నాయకురాలిగా ఆమె ఎదిగారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆస్తిపన్ను మినహాయింపు తదితర పలు సంచలన విధానాలను ఆమె ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా, ఇటీవల ఆమె నేతృత్వంలోని సంప్రదాయవాద ప్రభుత్వం.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా అధికారంలో ఉన్న ప్రభుత్వంగా ఘనత సాధించడం గమనార్హం.

Leave a Reply