2026 ఆసియా క్రీడల్లో మహిళల ఎంఎంఏ (MMA) సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి సుసిక, సింగపూర్‌కు చెందిన టిఫనీ టియో (Tiffany Teo) తలపడ్డారు.
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ నిర్ణీత సమయం డ్రా కావడంతో, అదనంగా మరో 1 నిమిషం కేటాయించారు. ఇందులో మొదట సింగపూర్ క్రీడాకారిణికి అనుకూలంగా పాయింట్లు ఇవ్వగా, భారత బృందం అప్పీల్ చేయడంతో రిఫరీలు మ్యాచ్‌ను మళ్లీ ‘టై’ (Tie) గా ప్రకటించారు.
టోర్నమెంట్ నిబంధనల ప్రకారం, మ్యాచ్ టై అయిన పక్షంలో ఇద్దరిలో ఎవరి బరువు తక్కువగా ఉంటుందో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఆ లెక్కన భారత క్రీడాకారిణి సుసిక, సింగపూర్ క్రీడాకారిణి కంటే సుమారు 700 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో, సింగపూర్ క్రీడాకారిణి ఫైనల్‌కు అర్హత సాధించినట్లు రిఫరీలు అధికారికంగా ప్రకటించారు.
కానీ, ఈ నిర్ణయాన్ని అంగీకరించని భారత క్రీడాకారిణి సుసిక, విజేతను ప్రకటించే ప్రదేశానికి రావడానికి నిరాకరించడమే కాకుండా, ప్రత్యర్థి క్రీడాకారిణితో కరచాలనం (షేక్ హ్యాండ్) చేసేందుకు కూడా నిరాకరించి తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రీడా నిబంధనలను గౌరవించి ఓటమిని అంగీకరించే ‘స్పోర్ట్స్‌మెన్‌షిప్’ (క్రీడాస్ఫూర్తి) లేకుండా, ఇలా పంతానికి పోవడం అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడల ప్రతిష్టను దిగజార్చేలా ఉందని నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తున్నారు.

Leave a Reply