హిమాచల్ ప్రదేశ్ రాజధాని ప్రాంతంలో 20 నెలల చిన్నారిపై రెండు వీధి కుక్కలు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై ఒక్కసారిగా రెండు కుక్కలు దాడి చేశాయి. అంతేకాదు… చిన్నారిని ఇంటి బయట నుంచి దాదాపు 20 నుంచి 30 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం.
కుక్కలు చిన్నారిని కరిచి గాయపరుస్తుండగా… ఆమె అరుపులు విన్న తల్లి, స్థానికులు వెంటనే బయటకు పరుగెత్తుకొచ్చారు.
కుక్కలతో పోరాడి… చివరకు చిన్నారిని వాటి నుంచి రక్షించారు.
ఈ దాడిలో చిన్నారి తల, చెవి సమీపంలో, మెడ, ఛాతీ, పొట్ట, చేతులు సహా శరీరంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వెంటనే చిన్నారిని సిమ్లాలోని ఐజీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి సుమారు 20 కుట్లు వేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సకాలంలో కుక్కల నుంచి చిన్నారిని రక్షించడంతో ప్రాణాపాయం తప్పిందని వారు చెప్పారు.
చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం… ఆమె ఇంట్లో బట్టలు ఉతుకుతున్న సమయంలో ఒక్కసారిగా చిన్నారి గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది.
బయటకు వచ్చి చూసేసరికి… రెండు కుక్కలు చిన్నారిని కరిచి ఈడ్చుకెళ్తున్నాయి.
వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో కుక్కలను తరిమి… చిన్నారిని రక్షించినట్లు ఆమె తెలిపారు.
ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి కుక్కల దాడిలో ఏర్పడిన గాయాలకు చికిత్స అందించారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా… ప్రమాదకరంగా మారిన వీధి కుక్కలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లి విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న చిన్నారి బంధువులు డెహ్రాడూన్ నుంచి సిమ్లాకు చేరుకున్నారు. చిన్నారి పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
చిన్నారులు, సాధారణ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని… వీధి కుక్కల సమస్యపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave a Reply