బెంగళూరు నగరంలో నివసించే వారికి బడ్జెట్‌కు తగిన మంచి అద్దె ఇల్లు దొరకడం ఎంత పెద్ద గగనమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ నేపథ్యంలో, గత మూడు వారాలుగా నగరంలో అద్దె ఇంటి కోసం కాళ్లరిగేలా తిరిగిన అనామిక అనే మహిళ, తనకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “బెంగళూరులో దేవుడినైనా చూసేయొచ్చు కానీ, బడ్జెట్లో ఒక మంచి ఇల్లు దొరకడం మాత్రం అస్సలు అసాధ్యం” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
తాను, తన భర్త ఇద్దరూ ఇంటి నుంచే పనిచేస్తున్నందున (Work From Home) నగరంలో ఏ ప్రాంతంలోనైనా ఇల్లు తీసుకోవడానికి సిద్ధపడ్డామని.. అయినప్పటికీ తమకు సరైన ఇల్లు దొరకలేదని ఆమె పేర్కొంది. బ్రోకర్ల సాయంతో నగరంలోని పలు ప్రాంతాలను జల్లెడ పడుతూ వారాల తరబడి తీవ్రంగా వెతికినా, సరైన అద్దె ఇంటిని సమకూర్చుకోవడం పెను సవాలుగా మారిందని వాపోయింది.
ముఖ్యంగా అక్కడి అద్దెలు, అడ్వాన్స్ (సెక్యూరిటీ డిపాజిట్) రేట్లు చూసి తాము షాక్‌కు గురయ్యామని అనామిక తెలిపింది. ఒక సాధారణ 2BHK ఫ్లాట్‌కు నెలకు ₹60,000 అద్దె, మెయింటెనెన్స్ కింద ₹5,000 నుంచి ₹7,000 వరకు అడుగుతున్నారని.. ఇక అడ్వాన్స్ కింద ఏకంగా ₹3 లక్షల నుంచి ₹8 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది. అసలు జనాలు ఇంత భారీ అద్దెలను ఎలాంటి ప్రశ్నా లేకుండా ఎలా చెల్లిస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఒంటరిగా ఉండే బ్యాచిలర్లు ఎంత అడిగితే అంత అద్దె ఇచ్చి ఉంటున్నారని, దానివల్ల కుటుంబాలతో ఉండేవారు కూడా అనివార్యంగా అంత భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఇల్లు వెతికే క్రమంలో బెంగళూరులోని సందు గొందులన్నీ తనకు కొట్టినపిండి అయ్యాయని.. అసలు ఇంత ఖర్చు చేసి ఇక్కడ బతకడం అవసరమా? అనే సందేహం కలుగుతోందని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Leave a Reply